పోలవరం ఏపీకి జీవనాడి
- 2026 అక్టోబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి
- 93 మీటర్లు డయాఫ్రం వాల్.. ఎత్తున స్పిల్ వే గేట్లు
- గతంలో రేయింబవళ్లు పనిచేశాం
- రివర్స్ టెండరింగ్‌తో సర్వనాశనం చేశారు
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. 2026 అక్టోబర్ నాటి కి ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. చంద్రబాబు సోమవారం హెలికాప్టర్‌లో పోలవరానికి చేరుకుని ప్రాజె క్టు వద్ద సుడిగాలి పర్యటన చేశారు.
మంత్రి నిమ్మల రామానాయుడు, ఇతర అధికారు లతో కలిసి వ్యూపాయింట్‌ను సందర్శించారు. ప్రాజెక్టు రోడ్డు మార్గం ద్వారా నిర్మా ణ ప్రాంతానికి వెళ్లి పనులను పరిశీలించి డయాఫ్రం వాల్ నిర్మాణంపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సమీక్షించి ప్రాజె క్టు పనుల షెడ్యూల్‌ను ప్రకటించారు.
పోలవరం, అమరావతి రెండు కళ్లు..
పోలవరం ప్రాజెక్టు వల్ల 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయ వచ్చన్నారు. విశాఖ పారిశ్రామిక అవసరాలు, తాగునీటికి 23 టీఎంసీలు అందుబా టులోకి వస్తాయని చెప్పారు. పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు అని స్పష్టం చేశారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి ప్రాజెక్టు గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు.
రాబోయే రోజు ల్లో నేరుగా కృష్ణానది నుంచి నాగార్జునసాగర్ కెనాల్‌కు అనుసంధానం చేస్తామని చెప్పారు. నేరుగా విశాఖకు నీటిని తరలించి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అక్కడి నుంచి వంశధారకు తీసుకెళ్లొచ్చన్నారు. ఈ పనులన్నీ పూర్తి చేస్తే రాష్ట్రమంతటికీ ఉపయోగం ఉంటుందన్నారు. ప్రాజెక్టు ప్రాముఖ్యత చూస్తే 50 లక్షల క్యూసెక్కులు డిశ్చార్జి చేసే సామర్థ్యం ఉందని.. 93 మీటర్లు డయాఫ్రం వాల్, అత్యంత ఎత్తయిన స్పిల్ వే గేట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బహుళ ప్రయోజనాల కోసం వినియోగించే ప్రాజెక్టు పోలవరం అని చంద్రబాబు పేర్కొన్నారు.
వైసీపీ నాశనం చేసింది..
వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2019 జూలైలో పోలవరం కాంట్రాక్టర్‌కు నోటీసులిచ్చి సైట్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలిచ్చారని గుర్తు చేశారు. 15 నెలలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా.. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును సర్వనాశనం చేశారని మండిపడ్డారు. వరదలకు డయాఫ్రం వాల్ పూర్తిగా దెబ్బతిన్న తర్వాత ప్రాజెక్టును పట్టించుకోలేదని మండిపడ్డారు. అసమర్థత, అవగాహన రాహిత్యం, కుట్రలతో ప్రాజెక్టును నాశనం చేశారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారాన్ని పోలవరంగా చేసి..
2014 నుంచి 2019 వరకు రేయింబవళ్లు పనిచేశామని చంద్రబాబు గుర్తు చేశారు. ఒక్కరోజులో స్పిల్ ఛానల్‌లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ రికార్డు కూడా బ్రేక్ చేశామని గుర్తు చేశారు. 414 రోజుల్లో డయాఫ్రం వాల్‌ను పూర్తి చేశామని చెప్పారు. సోమవారా న్ని పోలవరంగా చేసుకొని సమీక్షలు చేశామని.. 28 సార్లు క్షేత్ర పరిశీలన, 82 సార్లు వర్చువల్‌గా సమీక్షలు చేసి 72 శాతం పనులు పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు.






