మత్తు పదార్థాల వేటలో ‘మ్యాక్స్’..!?
కేసముద్రం, మే 26 (విజయక్రాంతి): నార్కోటిక్ డాగ్ ‘మ్యాక్స్’ సహాయంతో గంజాయి, మత్తు పదార్థాల కోసం అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ప్రత్యేక కూంబింగ్, తనిఖీ కార్యక్రమం నిర్వహించారు.
కేసముద్రం ఎస్ఐ క్రాంతి కిరణ్, 2వ ఎస్.ఐ నరేష్ ఆధ్వర్యంలో నార్కోటిక్ డాగ్ ‘మ్యాక్స్’ డాగ్, హ్యాండ్లర్ శివరాజ్, పోలీస్ సిబ్బంది కలిసి పట్టణ శివారు ప్రాంతాలు, చెట్ల పొదలు, నిర్మానుష్య ప్రదేశాలు, రైల్వే ట్రాక్ పరిసరాలు, యువత గుమికూడే ప్రాంతాలు, గంజాయి సేవిస్తున్నట్లు అనుమానిత ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయని, క్షణిక ఆనందం కోసం భవిష్యత్తును పాడు చేసుకోవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలన్నారు.
యువత చదువు, ఉద్యోగం, క్రీడలు, మంచి లక్ష్యాల వైపు అడుగులు వేయాలని, గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే 8712656999 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. కేసముద్రం పరిధిలో మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, గంజాయి సేవిస్తూ లేదా విక్రయిస్తూ పట్టుబడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






