మహిళల అక్రమ రవాణా కేసును ఛేదించిన పోలీసులు
బెజ్జూర్, మార్చి20 (విజయక్రాంతి): జిల్లాలోని బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2025 సెప్టెంబర్లో నమోదైన మహిళల అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ప్రత్యేక దర్యా ప్తు బృందం చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు బాధిత యువతులను సురక్షితంగా రక్షించి వారి కుటుంబాలకు అప్పగించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కౌటాల సీఐ సంతోష్ కుమార్, బెజ్జూర్ ఎస్సై సర్తాజ్ పాషా తెలిపిన వివరణ ప్రకారం...
బాధిత యువతులు మంచిర్యాల ప్రాంతంలో ఉద్యోగం చేసే సమయంలో ముదిమాడుగుల ప్రశాంత్ @ బబ్లు, అతని భార్య సవిత (కిష్టంపేట్, చెన్నూ రు), మహేష్ (సిరోంచ, మహారాష్ట్ర)లు వారికి పని కల్పిస్తామని చెప్పి పరిచయం పెంచుకున్నారు. ఆ తర్వాత ఇతర ప్రాంతాల వారితో వివాహాలు జరిపి డబ్బు సంపాదిస్తామని ప్రలోభపెట్టారు. బాధిత యువతులు అంగీకరించకున్న వారిని బలవంతంగా రైలులో ఎక్కించి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి తరలించారు.
అక్కడ బాధిత యువతుల ఇష్టానికి విరుద్ధంగా స్థానికుల కుటుంబాల వద్ద మేనమామలుగా నటిస్తూ దేవాలయంలో వివాహాలు జరిపినట్లు విచారణలో వెల్లడైంది. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.2.5 లక్షల చొప్పున మొత్తం రూ.5 లక్షల వరకు అక్రమంగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తర్వాత బాధితులను అక్కడే వదిలి పెట్టి నిందితులు పరారయ్యారు.
పోలీసులు మొబైల్ ఫోన్ లొకేషన్, సిమ్ డేటా, సాంకేతిక ఆధారాల సహాయంతో మధ్యప్రదేశ్లోని ఆత్రేయపురంలో బాధితులను సురక్షితంగా గుర్తించి తీసుకువచ్చారు. అసిఫాబాద్ ఎస్పీ నితిక పంత్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితులు ముదిమాడుగుల ప్రశాంత్ @ బబ్లు, సవిత, మహేష్లను అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు.
వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంక్ పాస్బుక్స్ వంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీరందరినీ అరెస్టు చేసి న్యాయ స్థానంలో హాజరుపరిచారు. పరారీలో ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్‌ను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.




