09-02-2026 12:00:00 AM
ఎన్నికల సమయంలో చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
నిజామాబాద్, ఫిబ్రవరి 8 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసులు పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు జరగనున్న నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు బోధన్ ఆర్మూర్ భీంగల్ మున్సిపాలిటీల పరిధిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా సిపి సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే సున్నిత ప్రాంతాలైన బోధన్ పురవీధుల్లో ముందుగా పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలు పరిరక్షించడం , ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్, భీంగల్ లోని ప్రధాన రహదారులు , జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు , సున్నిత ప్రాంతాల్లో పోలీస్ బలగాలు పాదయాత్రగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి.
ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సిపివిజ్ఞప్తి చేశారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి సమస్య తలెత్తిన పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు. ఈ ఫ్లాగ్ మార్చిన వలన ఎన్నికలవేళ ప్రజల్లో భద్రతాభావం , నమ్మకం పెరుగుతుందని , పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో ఏసీపీలు, సిఐలు , ఎస్.ఐ లు , క్యూ.ఆర్.టి సిబ్బంది , ఆర్ముడు రిజర్వ్ సిబ్బంది సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొనడం పాల్గొన్నారు.