17 July, 2026 | 12:47 AM

19 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలి

17-07-2026 12:00 AM
  1.   5వేలు వద్దు 19వేలు ముద్దు నినాదాలతో నిరుద్యోగుల ధర్నా
  2. అరెస్టయిన యువతను పరామర్శించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

నాగోల్, జూలై 16 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19 వేల పోలీస్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో దిల్సుఖ్నగర్లో భారీ మహాధర్నా నిర్వహించారు. ‘5000 వద్దు19000 ముద్దు‘ అనే నినాదాలతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు.

నిరసన సందర్భంగా పోలీసులు లాఠీచార్జీ చేసి పలువురు నిరుద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ డిమాండ్లను వినిపిస్తున్న నిరుద్యోగ యువతపై బలప్రయోగం చేయడం తగదని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ప్రసన్న హరికృష్ణ, కిరణ్లతో కలిసి నాగోల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి అరెస్టైన నిరుద్యోగ యువతను పరామర్శించి సంఘీభావం తెలిపారు.

వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను పారదర్శకంగా, వేగంగా భర్తీ చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల జేఏసీ నాయకులు ఇంద్రా నాయక్, ఆకాష్, శంకర్, శింబు కుమార్ నాయక్, సింధూ రెడ్డి, రమేష్, చెర్రీ, ప్రవీణ్ కుమార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ, నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.