calender_icon.png 9 May, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధ దంపతుల హత్య కేసును ఛేదించిన పోలీసులు

08-05-2025 12:04:22 AM

  1. డబ్బు, నగల కోసమే పాత నేరస్తుడి ఘాతుకం 

వివరాలు వెల్లడించిన డిసిపి కోటిరెడ్డి 

మేడ్చల్, మే 7(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్య నగర్ లో ఈనెల 3న జరిగిన వృద్ధ దంపతులు అల్లి కనకయ్య (70), అల్లి రాజవ్వ (65) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పాత నేరస్తుడు మచ్చ బొల్లారానికి చెందిన చింత కింది అనిల్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. కేసు వివరాలను డీసీపీ కోటిరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు సవాలుగా తీసుకొని దర్యాప్తు చేశారు. అడిషనల్ డీసీపీ పురుషోత్తం యాదవ్, పేట్ బషీరాబాద్ ఏసిపి రాములు, ఎస్‌ఓటి, ఏసిపి శ్రీనివాస్, అల్వాల్  సీఐ రాహుల్, డీ ఐ తిమ్మప్ప, ఎస్ ఓ టి ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి 48 గంటల శ్రమించారు.

100 సిసి కెమెరాలు పరిశీలించారు. పాత నేరస్తులపై నిఘావేశారు. హతుల వద్ద ఉన్న సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. వీటి సిగ్నల్ను పోలీసులు పరిశీలించారు. ఇవన్నీ పరిశీలించిన అనంతరం పాత నేరస్తుడు చింత కింది అనిల్ పై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. 

నిందితుడు పై 29 కేసులు 

నిందితుడు చింతకింది అనిల్ కరడుగట్టిన నేరస్థుడు. ఇతనిపై ఇదివరకే 29 కేసులు ఉన్నాయి. ఇతనికి కావలసింది డబ్బు. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. 29 కేసులలో 21 దొంగతనం, ఒకటి దోపిడీ, రెండు మానభంగం, హత్య కేసులు. ఇతనికి జీవిత ఖైదీ శిక్ష పడితే హై కోర్టులో అప్పీలు చేసుకుని ఏప్రిల్ 26న బయటకు వచ్చాడు.

ఇంటి వారు రానీయకపోవడంతో రాత్రి సమయంలో ఇమ్లీబన్ బస్టాండ్ పడుకున్నాడు. మచ్చ బొల్లారం, బొల్లారం, అల్వాల్ ప్రాంతాల్లో సంచరించాడు. ఒక ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించగా వారు మేల్కోవడంతో పరారయ్యాడు. ఈనెల 3న అదును చూసి కనుకయ్య ఇంట్లోకి చొరబడి ఘాతుకానికి పాల్పడ్డాడు.