21 August, 2026 | 4:07 PM

మహిళను చంపి కారు డిక్కీలో కుక్కి...

21-08-2026 02:58 PM

వరంగల్ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో కారు డిక్కీలో లభ్యమైన మహిళ మృతదేహం ఘటన చిక్కుముడిని పోలీసులు చేదించారు. డీసీపీ కవిత కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీకి చెందిన మానస (33) అనే మహిళను ఆమెతో పరిచయం ఉన్న ఎలక తుర్తికి చెందిన వినోద్ అనే వ్యక్తి కరీంనగర్ లో హత్య చేసి శవాన్ని ఆచూకీ లేకుండా చేయడానికి కారు డిక్కీలో వేసి తీసుకువచ్చి మూడు రోజుల క్రితం ఎలుకతుర్తి వద్ద నిలిపి ఉంచాడని, ఈ క్రమంలో మృతదేహం కుళ్ళిపోయి దుర్వాసన రావడంతో విషయం బయటకు వచ్చిందన్నారు.

సంఘటనపై ఎలుకతుర్తి పోలీసులు దర్యాప్తు చేపట్టి కారు ఓనరు ద్వారా నిందితుని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని, అతను ఇచ్చిన సమాచారం మేరకు మానసను అతను హత్య చేసి, శవాన్ని కనిపించకుండా చేయడానికి ఎలుకతుర్తికి తీసుకువచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు. ఈ సంఘటన కు పాల్పడ్డ నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నాడని, మరింత విచారణ సాగుతోందని, మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. హత్యకు గల కారణాలు, సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నామని డీ సీ పీ తెలిపారు.