calender_icon.png 20 November, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకున్న సైబర్ క్రైమ్

20-11-2025 02:51:22 PM

హైదరాబాద్: ఐబొమ్మ పైరసీ నెట్‌వర్క్(iBomma Piracy Network) వెనుక ప్రధాన సూత్రధారి అని భావిస్తున్న ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు( Hyderabad Cyber Crime) గురువారం చంచల్‌గూడ సెంట్రల్ జైలులో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయడంతో స్థానిక కోర్టు నిందితుడిని ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది. గత వారం ఫ్రాన్స్ నుంచి వచ్చిన రవిని పోలీసులు అరెస్టు చేసి సినిమా పైరసీకి సంబంధించిన కేసులో రిమాండ్‌కు తరలించారు. రవి తన నెట్‌వర్క్ ద్వారా 'ఐబొమ్మ'తో సహా వివిధ వెబ్‌సైట్‌లలో సినిమాలను అప్‌లోడ్ చేస్తున్నాడు. అక్రమ వ్యాపారం ద్వారా రవి వందల కోట్ల రూపాయలు సంపాదించాడని, భారీ పెట్టుబడులు పెట్టాడని పోలీసులు తెలిపారు.

అక్రమంగా సంపాదించిన ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది, అంతేకాకుండా రవి ఆస్తులు కొనుగోలు చేసి భారీగా పెట్టుబడులు పెట్టాడని అనుమానిస్తున్న బినామీలను కూడా తనిఖీ చేసే అవకాశం ఉంది.రవి బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ నిర్వాహకులతో కుమ్మక్కయ్యాడని, దేశ ఆర్థిక స్థిరత్వం, డిజిటల్ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా పరిణమించాడని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వాదించారు. సైబర్ క్రైమ్ కార్యాలయంలో రవిని విచారించనున్నారు. వివిధ భాషల్లో 21 వేల సినిమాలను రవి పైరసీ చేశాడు. ఆరేళ్లుగా 66 మిర్రర్ వెబ్ సైట్లలో  పైరసీ సినిమాలు అప్ లోడ్ చేశాడు. అన్ని అంశాలపై సైబర్ క్రైమ్ కూపీ లాగనుంది. అటు టాలీవుడ్‌కి మరో బిగ్ షాక్ తగిలింది. ఐబొమ్మ వన్ పేరిట మరో వెబ్‌సైట్ వెలుగులోకి వచ్చింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన  కొన్ని రోజుల్లోనే ‘ఐబొమ్మ వన్’ వెబ్‌సైట్ తెరమీదకి రావడంతో అందరూ షాకయ్యారు. ఐబొమ్మ తరహాలోనే దీంతో కూడా కొత్త సినిమాలున్నాయి. లింక్ క్లిక్ చేస్తే మూవీ రూల్జ్ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవుతోంది.