calender_icon.png 20 November, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమావాస్య పుణ్యక్షేత్రం.. చెరువుగట్టు

20-11-2025 03:34:33 PM

భక్తుల కొంగు బంగారంగా శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి క్షేత్ర మహాత్మ్యం 

నకిరేకల్,(విజయక్రాంతి): ​నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో వెలసిన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ముఖ్యంగా అమావాస్య వచ్చిందంటే చాలు.. ఈ ఆలయం భక్త జనంతో కిటకిటలాడుతుంది. రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తండోప తండాలుగా తరలివచ్చి శివయ్యను దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. అమావాస్య రోజున భక్తుల పోటెందుకు..? 

​ఈ క్షేత్రంలో అమావాస్య రోజున నిద్రించి (రాత్రి జాగారం చేసి) శివయ్యను దర్శించుకుంటే అన్నీ మంచే జరుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ముఖ్యంగా అమావాస్య రాత్రి ఇక్కడ నిద్ర చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని, మంచి ఆరోగ్యం లభిస్తుందని, కష్టాలు తొలగి తాము అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.​తెల్లవారుజామున లేచి గుండంలో స్నానం చేసి, తలనీలాలు సమర్పించి, ముడుపులు కట్టుకొని, స్వామివారి పాదాలను తలపై పెట్టుకుని ప్రదక్షిణలు చేసి, జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయితీ.

​ ఆలయ చరిత్ర, క్షేత్ర దర్శనీయ స్థలాలు మూల విరాట్ ప్రత్యేకత

​ఈ ఆలయం నార్కట్ పల్లికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో చెరువుగట్టు గ్రామంలో ఉంది. గ్రామానికి తూర్పున చెరువు ఒడ్డున పార్వతీ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం, పశ్చిమాన కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం కొలువై ఉన్నాయి.​శ్రీ పార్వతి జడలరామలింగేశ్వర స్వామి మూల విరాట్

​నామకరణం వెనుక కథనం: ఈ క్షేత్రంలో కొలువైన శివలింగంపై జడల మాదిరిగా రేఖలు ఉండటం వలన 'జడల రామలింగేశ్వర స్వామి'గా ప్రసిద్ధి చెందింది. పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్టించడం వలన 'రామలింగేశ్వర స్వామి'గా, కొండ దిగువన పార్వతి అమ్మవారు కొలువై ఉన్నందున 'శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి'గా పిలవబడుతోంది. ఈ లింగం ఇతర శివలింగాల వలె గుండ్రంగా కాకుండా, జడల మాదిరిగా ఎత్తుపల్లములు కలిగి, విశేష మోక్షప్రదాతగా వెలుగుతోంది. దీనితో భక్తులు జడలు పెంచుకుని వచ్చి స్వామిని దర్శించుకోవడం ఇక్కడి ఆచారం.​క్షేత్ర మహాత్మ్యం - పరశురాముడి ప్రతిష్ట

​పరశురాముడు 21 సార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియులను అంతం చేసిన అనంతరం,విశ్వకల్యాణార్థమై 108 క్షేత్రాల్లో శివలింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించాడు. తాను ప్రతిష్ఠించిన 108 శివలింగాల్లో చివరిది ఈ క్షేత్రమేనని కథనాలు చెబుతున్నాయి. ​శివుడు ప్రత్యక్షం కానందున ఆగ్రహించిన పరశురాముడు, తన పరశువు(గండ్రగొడ్డలి)తో శివలింగంపై కొట్టగా శివుడు సాక్షాత్కరించికలియుగాంతం వరకూ ఈ క్షేత్రంలో నిలిచి భక్తులకోరికలునెరవేరుస్తానని వాగ్దానం చేశాడని స్థల పురాణం చెబుతోంది. ఆనాటి నుండి ఈ క్షేత్రం సుప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతోంది.గుండంలో స్నానమాచరించి, ఇక్కడ ఏర్పడి ఉన్న స్వామివారి పాదాలను దర్శించుకుంటే, స్వప్నంలో స్వామివారు సాక్షాత్కరించి, వారి బాధా నివారణ మార్గాలను తెలియజేస్తారని భక్తుల నమ్మకం.​ఆంజనేయస్వామి (క్షేత్రపాలకుడు): కొండపై గల ఆంజనేయస్వామిని ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తారు. భూత, ప్రేత, పిశాచ బాధలతో సతమతమవుతున్న భక్తులు ఇక్కడ 40 రోజులు (మండలం) ప్రదక్షిణలు చేసి, తమ బాధలను పోగొట్టుకుంటారని విశ్వాసం. భూత, పిశాచి బాధలతో ఉన్నవారికి స్వామివారి పాదాలు తాకించడం ఇక్కడ ఆనవాయితీ.

మూడు గుండ్లు : కొండపై భాగంలో 'మూడు గుండ్లు'గా పిలువబడే పెద్ద బండరాళ్ళ మధ్యలో సన్నని, ఇరుకైన సందు మార్గంలో నుంచి వెళ్తూ మరో శివలింగాన్ని దర్శించుకోవడం భక్తుల ఆనవాయితీ.భక్తి భావం ఉన్న ఎంతటి లావుపాటి వ్యక్తులైనా సునాయాసంగా వెళ్లగలరు. చెడు ఉద్దేశంతో లేదా అపరిశుభ్రంగా వెళ్లిన స్త్రీ, పురుషులు మధ్యలో చిక్కుకుంటారు బయటికి వెళ్ళలేరని భక్తుల నమ్మకం.

​ ఎల్లమ్మ పూజలు : ఈ క్షేత్రంలో ఎల్లమ్మ పూజలు జరిపితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని కథనాలు ఉన్నాయి.

 శివ సత్తుల శిగాలు : క్షేత్రంలో శివసత్తుల శిగాలు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. భక్తులకు కొలుపు చెబుతారు. ​ఈ విధంగా శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం అద్భుతమైన మహత్యాలతో అమావాస్య జాగరణ సంప్రదాయంగా భక్తులకు కొంగుబంగారంగా  వెలుగొందుతోంది.