11 May, 2026 | 1:49 AM

నేర విచారణలో రాజకీయ జోక్యం!

11-05-2026 01:11 AM
  1. పోలీసులపై పెరుగుతున్న ఒత్తిడి
  2. దర్యాప్తులో పారదర్శకత ఉండటం లేదని, ప్రభుత్వానికి అనుకూలంగా జరుగుతుందని విమర్శలు 
  3. చట్టాలు, దర్యాప్తు సంస్థలపై ప్రజల్లో తగ్గుతున్న నమ్మకం

హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): నేరాల విచారణలో రాజకీయ జోక్యం నానాటికీ పెరుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పోలీసులు, దర్యాప్తు సంస్థ లు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారన్న విమర్శలున్నాయి.  తమ వారు నేరాల్లో చిక్కుకున్నప్పుడు దర్యాప్తును నీరుగార్చడం, ఆధా రాలను తారుమారు చేయడం, లేదా కేసులను మూసివేయించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు పెరుగుతున్న కొద్దీ దర్యాప్తు సంస్థల నిష్పక్షపాత ధోరణిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు, ఆ కేసు పెట్టిన బాలికపై హనీ ట్రాప్ కేసు నేపథ్యంలో పోలీ సు వ్యవస్థ, విచారణ సరళి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రతిపక్ష పార్టీ లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు నమోదైతే దర్యా ప్తు సంస్థలు అత్యంత వేగంగా పని చేస్తున్నాయని. నోటీసులు, అరెస్టులు, విచారణలు, మీడియా లీకులు అన్నీ ఒకేసారి జరుగుతున్నాయని విమర్శిస్తున్నాయి. అదే అధికార పార్టీకి చెందిన నేతలు లేదా వారికి సన్నిహితులపై కేసులు, ఆరోపణల విషయంలో దర్యాప్తు నెమ్మదిగా సాగుతుందనే ఆరోపణలున్నాయి. 

రాజకీయ మద్దతు ఉంటేనే..

నేరాలకు సంబంధించిన కేసుల విచారణలో రాజకీయ ప్రమేయం కారణంగా ప్రజల్లో చట్టాలు, దర్యాప్తు సంస్థల పై నమ్మకం తగ్గుతోంది. ఒకప్పుడు న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లే పరిస్థితి నుంచి ఇప్పుడు రాజకీయ మద్దతు లేకపోతే న్యాయం దొరకన్న భావన ప్రజల్లో పెరుగుతోంది. నిష్పక్షపాత విచారణపై సందేహాలు పెరిగితే ప్రజలు చట్టవ్యవస్థపై నమ్మకం కోల్పోయే ప్రమాదం లేకపోలేదు.  అది చివరికి న్యాయవ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎందుకంటే దర్యాప్తు సరిగా జరగపోతే కోర్టుల్లో కేసుల ఫలితాలపై కూడా ప్రభావం పడుతుంది.  ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాలకు అధికారాలు ఉన్నప్పటికీ చట్ట అమలు సంస్థలు స్వతంత్రంగా ఉండాల్సిందేనని అంటున్నారు.  విచారణల్లో రాజకీయ జోక్యం పెరిగితే భవిష్యత్‌లో ఏ ప్రభుత్వం వచ్చినా అదే విధానాన్ని కొనసాగించే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దీని వల్ల స్వయం ప్రతిపత్తి గల సంస్థల ప్రాధాన్యత బలహీనపడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పోలీసు సంస్కరణలపై చర్చ జరుగుతోంది. 

కేసుల విచారణలో పారదర్శకత పెరగడం, దర్యాప్తు సంస్థల పనితీరుపై ప్రజలకు విశ్వా సం కలిగించే విధానాలు రావాలని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోతున్న పోలీసులు!

పోలీస్ వ్యవస్థపై రాజకీయ ప్రభా వం పెరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కీలక కేసులు దర్యాప్తు చేస్తున్న అధికారుల బదిలీలు, పోస్టింగులు రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన అధికారులకు కీలక పోస్టింగులు, అసౌకర్యంగా మారిన అధికారులకు బదిలీలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. దీని వల్ల క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారుల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది.