7 May, 2026 | 2:40 AM

టార్గెట్ తెలంగాణ

07-05-2026 01:45 AM
  1. రంగంలోకి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా 
  2. రాష్ట్రంలో మకాం వేయనున్న బీజేపీ అగ్రనేతలు 
  3. ప్రధాని మోదీ సభతో సమర శంఖం 
  4. బంగాల్ తరహాలో తెలంగాణపై స్పెషల్ ఫోకస్

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): ఇటీవల వెలువడిన ఐదు అసెంబ్లీల ఎన్నికల ఫలితాల్లో.. మూడింట ఘన విజయం సాధించిన బీజేపీ ఫుల్ జోష్ మీదుంది. తదుపరి టార్గెట్‌ను ఫిక్స్ చేసుకుంది. అదే.. తెలంగాణ. పశ్చిమ బెంగా ల్‌లో బీజేపీ ఎన్నటికీ పాగా వేయలేదని అనుకున్నవారి అంచనాలను పటాపంచలు చేస్తూ అక్కడ బీజేపీ ఘన విజయం సాధించింది. సరిగ్గా బంగాల్ తరహా వ్యూహాలను తెలంగాణలో అమలుచేసి అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ భారీ స్కెచ్ వేస్తోంది.

దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటకను హస్తగతం చేసుకోవాలని బీజేపీ హైకమాండ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో తెలంగాణపై మరీ ఎక్కువగా ఫోకస్ పెట్టాలని భావిస్తోంది. తెలంగాణలో బీజీపీ అధికారంలోకి వచ్చేందుకు ఎక్కువగా అవకాశా లు కనిపిస్తున్నాయి.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో 13.09 శాతం ఓట్ షేర్‌తో 8 స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. అదే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 35.08 శాతం ఓట్లతో 8 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. బీజేపీ హైకమాండ్ కూడా తమ గెలుపునకు అవకాశాలు ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నాయని భావిస్తోంది. తెలంగాణలో పార్టీ బలంగా ఎదుగుతున్నదని కూడా పార్టీ అధిష్ఠానం విశ్వసిస్తున్నది.

మకాం వేయనున్న నేతలు..

2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే ఇప్పటినుంచే తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేయాల్సి ఉం టుంది. ఇందులో భాగంగానే పలువురు జాతీయస్థాయి కీలక నేతలను హైకమాండ్ రంగంలోకి దింపనుంది. తెలం గాణకు చెందిన ఓ బీజేపీ కీలక నేతకు ఇటీవల అమిత్‌షా నేరుగా ఫోన్ చేసి తెలంగాణకు ‘మై ఆరా హూ’ అంటూ చెప్పడం గమనార్హం. అంటే బీజేపీ నెక్స్ ఫోకస్ అనేది తెలంగాణ అనేది ఇక్కడ స్పష్టమవుతోంది.

త్వరలోనే అమిత్‌షా రంగంలోకి దిగనున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలోనూ మోడీ విస్త్రృత ప్రచారం చేయడం,అమిత్ షా అక్కడే మకాం వేయడం.. హిందూత్వ అజెండాను, ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం లాంటి వ్యూహాలతో బీజేపీ విజయం దక్కించుకుంది. దక్షిణాదిలో.. కర్ణాటకలో ప్రస్తు తం బీజేపీ, జేడీ(ఎస్)తో పొత్తు ఉంది. దీంతో దక్షిణాదిలో ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశమున్న ఏకైకా రాష్ట్రం తెలంగాణే.

పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిషాకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సంస్థాగత ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. తెలంగాణ తప్ప ఆ రెండు రాష్ట్రా ల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక మిగిలి ఉన్నది తెలంగాణే. ఇందులో భాగంగానే అమిత్‌షాతోపాటు ఆయనను లేదా ఇతర కీలక  నేతలను రంగంలోకి దింపి తెలం గాణలో కాషాయ జెండా ఎగురవేయాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది. 

మొదటి సభ మోదీతోనే!..

వాస్తవానికి అసెంబ్లీల ఎన్నికల ఫలితాల కంటే ముందే తెలంగాణలో మోదీ పర్యటన ఖరారు అయింది. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఇప్పుడు అందరి దృష్టి ఈనెల 10న సికింద్రాబాద్‌లో జరిగే బహిరంగ సభపైనే అంతా చర్చించుకుంటున్నారు. ఈ సభ నుంచి మోదీ ఏం మాట్లాడుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రానున్న జీహెచ్‌ఎంసీ, అసెంబ్లీ ఎన్నికలకు మోదీ సభతోనే సమరశంఖాన్ని బీజేపీ పూరించనున్నదనే చర్చ జరుగుతోంది.

తెలంగాణలో పట్టుసాధించుకునేందుకు మోదీ చరి ష్మానే ప్రధాన అస్త్రంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోం ది. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో వచ్చిన అనూహ్య ఫలితాలు, పెరిగిన ఓటు బ్యాంకును ఆసరగా చేసుకుని కేడరల్‌లో సమరోత్సాహాన్ని నింపనున్నారు.

కేవలం భావోద్వే గ అంశాలే కాకుండా, కేంద్ర పథకాల లబ్ధిదారులను ఓటు బ్యాంకుగా మార్చుకునేలా ప్రధాని ప్రసంగం ఉండే అవకాశముంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ మధ్య ఉన్న రాజకీయ ఖాళీని భర్తీ చేయడమే వ్యూ హంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్‌గానే వెళ్లాలని బీజేపీ భావిస్తోంది.