ప్రజాపోరాటాలకు రాజకీయ శిక్షణ ఎంతో దోహదపడాలి
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి
కమ్యూనిస్టు పార్టీ ఆశయాల సాధనకు కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు
భద్రాచలం, జులై 9 (విజయక్రాంతి): ప్రజా పోరాటాలకు మూడు రోజులపాటు జరిగిన రాజకీయ శిక్షణ దోహదపడాలని, ప్రజలను చైతన్యపరిచి పోరాటాల వైపు నడిపించే చైతన్య తీసుకురావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు అన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సమావేశం గురువారం భద్రాచలంలోని రెడ్డి సత్రంలో జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కౌన్సిల్ సభ్యుల రాజకీయ శిక్షణా తరగతుల ముగింపు అనంతరం ఈ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు సాగిన శిక్షణా తరగతులపై సమగ్రంగా సమీక్ష జరిపారు. ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ అత్యంత కీలకమైనదని, ఇందులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకులు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాల ఉధృతిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ సమకాలీన సామాజిక సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించాలన్నారు.
కమ్యూనిస్టు పార్టీ ఆశయాల సాధనకు కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని, ప్రజా పక్షాన నిలబడి పోరాడటమే నాయకుల, కార్యకర్తల ప్రధాన బాధ్యతని అన్నారు. చలో ఢిల్లీ, జిల్లా వ్యాప్త పాదయాత్రలు, అంగన్వాడీ యూనియన్ పాదయాత్ర, గిరిజన సమాఖ్య రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని, అందుకోసం ప్రతి కార్యకర్త తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచించారు. సిపిఐ రాష్ట్ర నాయకులు ముత్యాల విశ్వనాథం కల్లూరు వెంకటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.






