పోలింగ్ కేంద్రాలు హౌస్‌ఫుల్ కావాలి
l ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
l రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్‌రాజ్
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ఐపీఎల్ మ్యాచ్‌లకు స్టేడియాలు హౌస్‌ఫుల్ అవుతున్నాయని, ఓటింగ్ రోజు పోలింగ్ స్టేషన్లు కూడా నిండిపోవాలని తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి వికాస్‌రాజ్ పిలుపునిచ్చారు. తీవ్రమైన ఎండల కారణంగా మొదటి దశలో ఓటింగ్ శాతం తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆదివారం ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కుర్చీలు, ఫ్యాన్లతో పాటు వడదెబ్బ తగిలిన వారికీ చికిత్స అందించేందుకు పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎండను లెక్కచేయకుండా ఐపీఎల్ మ్యాచ్ ను చూడటానికి వెళ్లుతున్నారని, అలాగే పోలింగ్ కేంద్రాలకూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.






