ప్రజల విశ్వాసం కోల్పోయిన రేవంత్
l విమర్శలపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదు
l దేవుళ్లపై ప్రమాణం కోడ్ ఉల్లంఘనే
l బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): రేవంత్‌రెడ్డి సీఎం అని మరిచిపోయి విమర్శలే రాజకీయ అస్త్రాలుగా భావిస్తూ ప్రజలకు సరైన పాలన అందించడంలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతోందని అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన నాలుగు నెలలకే రేవంత్‌రెడ్డి ప్రజల విశ్వాసం కోల్పోయారని, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ స్థానాలు గెలవకపోతే సీఎం కుర్చీ పోతుందని భయపడుతున్నారని పేర్కొన్నారు.
అందుకే ఆగస్టు నెలలో రుణమాఫీ చేస్తానని మహబూబాబాద్, మెదక్ సభల్లో దేవుడిపై ప్రమాణం చేశారని పేర్కొన్నారు. దేవుడిపై ప్రమాణం చేసి ఓట్లు అడగడం అంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. 420 హామీలు నేరవేర్చడానికి ముఖ్యమంత్రి ఎంతమందిపై దేవుళ్లపై ప్రమాణం చేస్తారో తెలపాలన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి, కోమటిరెడ్డిని తొక్కి సీఎం అయినట్లు రేవంత్ చెబుతున్నారని, భవిష్యత్తులో ఆ పా ర్టీ ఢిల్లీ నేతలకూ ఇదే పరిస్థితి ఉంటుందనే అనుమానం కలుగుతుందన్నారు. ఆయన నాయకత్వాన్ని వీహెచ్, సర్వే సత్యనారాయణ, మోత్కుపల్లి వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రజలు సాగు, తాగునీరు, కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నారని, సీపీఐ కార్యాలయానికి విద్యుత్ శాఖ మంత్రి వెళితే అక్కడ అరగంట పాటు కరెంటు పోయిందన్నారు.
పవర్ మంత్రికే పవర్ లేకపోతే సామాన్య జనం పరిస్థితి ఏమిటని నిలదీశారు. త్వరలో సీఎం బీజేపీలో చేరుతారని ఎంపీ అరవింద్ అంటున్నారని, అందుకోసమే పార్టీ కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను రక్షించుకునేందుకు తెగ తాపత్రయ పడుతున్నారని, గాంధీభవన్‌కు తాళం వేసి ఇంటినుంచే పాలన వ్యవహారాలు సాగిస్తున్నారన్నారు. ప్రజా సమస్యల పేరుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పిలుపించుకుని కాంగ్రెస్ కండువా కప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం, కడియం, గడ్డం రంజిత్‌రెడ్డిపై ఆ పార్టీ క్యాడర్ తిరుగుబాటు చేస్తోందన్నారు. ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టే బస్సు యాత్రతో మంచి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.






