8 రాష్ట్రాలు, 58 సీట్లు..
ఇవాళ ఆరో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్
న్యూఢిల్లీ, మే 24: ఆరో విడత లోక్‌సభ పోలింగ్ ఇవాళ జరగనుది. 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. హర్యానాలోని 10 స్థానాలకు, ఢిల్లీలోని ఏడు స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లోని 14 లోక్‌సభ స్థానాలకు, బీహార్, పశ్చిమబెంగాల్‌లో 8 స్థానాలు చొప్పున, ఝార్ఖండ్‌లో నాలుగు సీట్లు, జమ్ము, కశ్మీర్‌లో ఒక్క సీటుకు పోలింగ్ జరగనుంది. మొత్తం 889 అభ్యర్థులు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 58 లోక్‌సభ స్థానాల్లో 1.14 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 11.4 లక్షల మంది సిబ్బందిని కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది.
ఖాతా తెరవని కాంగ్రెస్..
2019 ఎన్నికల్లో ఈ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయితే ఈసారి ఎన్నికల్లో తన ఉనికి చాటుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక గత ఎన్నికల్లో 40 సీట్లను బీజేపీ గెలుచుకోగా, ఎస్పీ ఒక సీటు కైవసం చేసుకుంది. ఆ ఒక్క సీటు కూడా ఉప ఎన్నికల్లో ఎస్పీ చేజారిపోగా, బీజేపీ దక్కించుకుంది. ఈ విడతలో పలువురు ప్రముఖులు పోటీలో ఉన్నారు.
యూపీలోని సుల్తాన్‌పూర్‌లో మేనకా గాంధీ (బీజేపీ), ఈశాన్య ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ (బీజేపీ), ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున కన్హయ్య కుమార్, అనంతనాగ్ రాజౌరీ నుంచి పీడీపీ తరఫున మెహబూబా ముఫ్తీ, పశ్చిమ బెంగాల్ తామ్లూక్ నుంచి బీజేపీ తరఫున అభిజిత్ గంగోపాధ్యాయ, ఒడిశా సంబాల్‌పూర్‌లో బీజేపీ తరఫున ధర్మేంద్ర ప్రధాన్, హర్యానా కర్నాల్ నుంచి బీజేపీ తరఫున మనోహర్ లాల్ ఖట్టర్, కురుక్షేత్ర నుంచి నవీన్ జిందాల్ తదితరులు పోటీలో ఉన్నారు.






