11-11-2025 01:32:38 AM
-మేడ్చల్ జిల్లాలో అన్ని బడులకు ఇవే బియ్యం సరఫరా
-ఆందోళన వ్యక్తం చేస్తున్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు
-విద్యార్థులకు పౌష్టికాహారం ఇదేనా.. అంటూ తల్లిదండ్రుల ఆగ్రహం
మేడ్చల్, నవంబర్ 10 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు, ఆకలితో విద్యార్థులు అలమటించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్) లక్ష్యం నీరుగారి పోతోంది. ఈ పథకానికి నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేయాల్సి ఉండగా, పురుగులు పట్టిన, మట్టి, ధాన్యం గిం జలతో కూడిన బియ్యం సరఫరా చేస్తున్నారు.
పురుగులు పట్టిన నాణ్యతలేని బియ్యం సరఫరా చేయడం వల్ల విద్యార్థులకు పోషకాహా రం అందడం ఏమో గాని అనారోగ్యం పాల య్యే అవకాశం ఉంది. ప్రతినెల ఇలాంటి బియ్యమే సరఫరా అవుతుండగా, ఈసారి పురుగులు మరీ ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఇలాంటి బియ్యమే సరఫరా అయ్యాయి. జిల్లాలో మొత్తం 498 ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాల ల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పాఠశాలలకు బియ్యం సరఫరా చేస్తుండగా, ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు విద్యార్థుల హాజరు ఆధారం గా ఏజెన్సీలకు బియ్యం అందిస్తున్నారు. బియ్యం తీసుకున్న తర్వాత పురుగులు, మట్టి, గింజలు వేరువేయడం మహిళలకు పెద్ద సమస్యగా తయారైంది. రెండు గంటల సమయం పడుతుందని ఏజెన్సీ నిర్వాహకులు వాపోతున్నారు. పురుగుల బియ్యం సరఫరా చేయడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు పురుగుల అన్నం తినాలా అని ప్రశ్నిస్తున్నారు. పేద ప్రజల పిల్లలను చిన్నచూపు చూడడమేనని అంటున్నారు.
నిధులు విడుదలలో నిర్లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం నోరూరించే మెనూ ప్రకటించినప్పటికీ అందుకు అనుగుణంగా నిధు లు విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తోంది. సోమ, బుధ, శుక్రవారంలో కోడిగుడ్డు అందించాలి. రాగి జావా ఇతర పోషకాహారం అందిం చాలి. కానీ ప్రభుత్వం సరిగా నిధులు విడుదల చేయనందున చాలాచోట్ల విద్యార్థులకు ఇవి అందడం లేదు. ప్రభుత్వం కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేస్తుంది. మిగతావన్నీ ఏజెన్సీ నిర్వాహకులే కొనుగోలు చేసుకోవాలి. ప్రభుత్వం ఎనిమిది నెలలుగా ఏజెన్సీలకు బకాయిలు విడుదల చేయడం లేదు. కోడిగుడ్లు, పప్పులు, కూరగాయలు, నూనె, ఇతర వస్తువులు కొనుగోలు చేసుకోవాలి. ప్రభుత్వం నిధులు విడుదల చేయకున్నా అప్పులు చేసి కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ఏజెన్సీకి లక్ష రూపాయల్లో అప్పు అయ్యింది.
కేంద్రం కరుణించినా....
భోజన ఏజెన్సీ నిర్వాహకులకు చాలీచాలని డబ్బులు ఇవ్వడం వల్ల గిట్టుబాటు కావడం లేదు. ధరలు పెంచాలని కొంతకాలంగా కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం నవంబర్ 27న ధరలు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఏడాదికి ఇటీవల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యా ర్థులకు రూ.5.45 నుంచి రూ.6.19, 6 నుంచి 8 తరగతిలో విద్యార్థులకు రూ.8.17 నుంచి రూ.9.29కు పెంచింది. 9, 10 తరగతుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిధు లు సమకూర్చుతోంది. వీరికి రూ. 10.67 నుం చి రూ.11.79 కు పెంచింది. అదనంగా కోడి గుడ్డుకు ఆరు రూపాయల చొప్పున కూడా రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది.
విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం సరికాదు
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు. పురుగులు, నాణ్యతలేని బియ్యం సరఫరా వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలైతే ఎవరు బాధ్యులు? ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీలకు 8 నెలలుగా బకాయిలు విడుదల చేయడం లేదు. వెంటనే ఏజెన్సీలకు నిధులు విడుదల చేయాలి.
ఉన్నికృష్ణన్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు