13 August, 2026 | 5:11 AM

రాష్ట్రంలో 36,353 పోలింగ్ కేంద్రాలు

13-08-2026 12:00 AM
  1. కొత్తగా పెరిగినవి 368
  2. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 4,094
  3. ములుగు జిల్లాలో అత్యల్పంగా 308
  4. ఆమోదం తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం
  5. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ చెల్లదని స్పష్టీకరణ

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో మొత్తం 36,353 పోలింగ్ కేంద్రాలు భారత ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. కొత్తగా 368 సెంటర్లు పెరిగాయి. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 4,094, ములుగు జిల్లాలో అత్యల్పంగా 308 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. అయితే ఓటరు నమోదు, పరిశీలన ప్రక్రియలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ చెల్లదని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో రాబోయే ఎన్నికల నిర్వహణ, ఓటర్ల సౌకర్యార్థం చేపట్టిన పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియకు భారత కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ఆమోదించింది. ఈ ప్రక్రియ ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 36,353 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ అధికారికంగా ఖరారు చేసింది. ఓటర్ల సంఖ్య సమతుల్యత, కేంద్రాల వద్ద రద్దీని తగ్గించే లక్ష్యంతో చేపట్టిన ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 368 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి.

రాష్ట్రంలో ఓటర్ల సాంద్రత ఎక్కువగా ఉన్న రాజధాని హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 4,094 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, గిరిజన, ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలో అత్యల్పంగా 308 కేంద్రాలు ఖరారయ్యాయి. ఒక్కో పోలింగ్ కేంద్ర పరిధిలో నిర్ణీత పరిమితికి మించి ఓటర్లు లేకుండా చూడటం, ప్రతి ఓటరు తమ నివాస ప్రాంతానికి వీలైనంత సమీపంలోనే ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడమే ఈ హేతుబద్ధీకరణ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఖరారైన నూతన కేంద్రాలకు అనుగుణంగా బూత్‌స్థాయి అధికారుల సర్దుబాటు, ఓటర్ల జాబితా నవీకరణ ప్రక్రియను ఎన్నికల యంత్రాంగం వేగవంతం చేసింది.

ఎఫ్‌ఆర్‌సీ రేషన్ కార్డుతో సమానం 

తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో కొత్తగా జారీ చేస్తున్న ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫి కెట్లు(ఎఫ్‌ఆర్‌సీ) చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జూలై 25న జారీ చేసిన జీఓ నంబర్ 172 ప్రకా రం ‘మీసేవ’ ద్వారా ఇచ్చే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లను ఓటరు నమోదు, పరిశీలన ప్రక్రియలో ఆమోదించలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈసీ కార్యదర్శి నవీన్‌కుమార్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అధికారిక లేఖ రాశారు.

గతంలో తహశీల్దార్లు క్షేత్రస్థాయి విచా రణ, పత్రాల తనిఖీ చేపట్టిన తర్వాతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లను జారీ చేసేవారని ఈసీ పేర్కొంది. కానీ, జీఓ 172 ప్రకారం ఎలాంటి ముందస్తు విచారణ లేకుండా, కేవలం రేషన్‌కార్డు డేటా ఆధారంగా ఆన్‌లైన్‌లో రెండు రోజుల్లోనే ఈ సర్టిఫికెట్లు ఇస్తున్నారని గుర్తు చేసింది. ఫలితంగా ఈ కొత్త సర్టిఫికెట్ కేవలం రేషన్‌కార్డుతో సమానమని వివరించింది.

రేషన్ కార్డులు పౌరసత్వానికి నిశ్చయాత్మక ఆధారం కావ ని, ఓటరు జాబితా తనిఖీకి వాటిని ప్రామాణిక పత్రంగా పరిగణించలేమని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈసీ లేఖలో ఉటంకిం చింది. అందువల్ల కొత్త జీఓ కింద ఇచ్చే ఫ్యామిలీ సర్టిఫికెట్లను గుర్తింపు పత్రాలుగా స్వీకరించలేమని తెలిపింది. అయితే, జీఓ 172 రాక ముందు (జూలై 25, 2026 కంటే ముందు) పాత విధానం ప్రకారం తహశీల్దార్ల విచారణ ద్వారా పొందిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లను మాత్రం పరిశీలన ప్రక్రియలో ఆమోదిస్తామని స్పష్టం చేసింది.