పొన్నం వర్సెస్ ఏలేటి
- గవర్నర్ ప్రసంగమంతా డొల్ల: బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
- కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారు?: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య వాగ్యుద్ధం నడిచింది. గురువారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రసంగించారు.. గవర్నర్ చేసిన ప్రసంగం పూర్తి డొల్ల అని, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అబద్ధాలనే గవర్నర్ వల్లెవేశారని విమర్శించారు.
గవర్నర్ ప్రసంగంలో నిజాలు లేవని ఓ డాక్యుమెంటరీని తలపించిందన్నారు. ఏడాదిలోనే రూ.1.52 లక్షలకోట్ల అప్పులు చేసినా.. హామీలు, గ్యారెంటీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, మాహబూబ్‌నగర్, మహబూబాబాద్ సహా పలు నగరాల పేర్లు మార్చాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే రుణమాఫీపై చర్చకు సిద్ధమా..అని తన ప్రసంగానికి అడ్డుపడిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సవాల్ విసిరారు.
రాష్ట్రాల ప్రయోజనాల అంశంలో కేంద్రానికి బాధ్యత లేదా అని మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేఎల్పీ నేత ఏలేటిని ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం చేయకుండా నిధులు తీసుకొస్తారని ఆశించామని.. కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదన్నారు. వారి మిత్రపక్షం ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్న నిధులకు..
తెలంగాణకు ఇస్తున్న నిధులపై తేడా చూడాలన్నారు. మోదీ హామీ ఇచ్చిన ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు ఏమయ్యా యి?.. 2 కోట్ల ఉద్యోగాలెక్కడ అంటూ పొన్నం సెటైర్లు వేశారు. రైతు రుణమాఫీపై తాము చర్చకు సిద్ధమని పొన్నం స్పష్టం చేశారు.






