12 August, 2026 | 10:06 AM

కంగ్టి బైపాస్‌కు మోక్షమెప్పుడు?

12-08-2026 09:21 AM

-ఏళ్లుగా హామీలే.. పనులు మాత్రం ప్రారంభం కాలేదు

-గుంతల రహదారులతో ప్రజలకు అవస్థలు

-వెంటనే నిర్మాణం చేపట్టాలి హెచ్‌.దాస్‌

కంగ్టి,(విజయక్రాంతి): కంగ్టి మండల కేంద్రంలో బైపాస్‌ రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కెవిపిఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి హెచ్‌.దాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏళ్లుగా బైపాస్‌ నిర్మాణంపై హామీలు ఇస్తున్నా పనులు ప్రారంభించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.కంగ్టి మీదుగా నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ రద్దీ పెరుగుతోందన్నారు. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బైపాస్‌ నిర్మాణం పూర్తయితే పట్టణంలోని రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణం సురక్షితంగా మారుతుందని అన్నారు.

గుంతలతో అధ్వాన రహదారులు

కంగ్టి పరిసర ప్రాంతాల్లో రహదారులు గుంతలమయంగా మారాయని దాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలవడంతో రహదారి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందన్నారు. గుంతల లోతు తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అత్యవసర వాహనాలు, ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

హామీలకే పరిమితమా?

బైపాస్‌ రహదారి నిర్మాణం చేపడతామని ప్రజాప్రతినిధులు, అధికారులు ఏళ్లుగా హామీలు ఇస్తున్నా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.అవసరమైన నిధులు కేటాయించి బైపాస్‌ రహదారి నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని, ప్రస్తుత రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని హెచ్‌.దాస్‌ డిమాండ్‌ చేశారు.