పోడు పట్టాల గిరిజన రైతులకు 90 శాతం సబ్సిడీపై కోళ్లు గొర్రెలు మేకల పథకాలు
పోడు పట్టాలు కలిగిన గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలి ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, జులై22, (విజయ క్రాంతి):ప్రధానమంత్రి జన జాతీయ గౌరవ ఉద్ధరణ అభియాన్ పథకం కింద 90 శాతం సబ్సిడీతో గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం వంటి సబ్సిడీ పథకాలు ఆదివాసి మారుమూల గిరిజన ప్రాంతాలలో ఉన్న పోడు పట్టా కలిగిన గిరిజన రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సంబంధిత పశుసంవర్ధక శాఖ అధికారులకు ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం భద్రాచలం డివిజన్ పరిధిలోని పశుసంవర్ధక శాఖ అధికారులతో గిరిజన గ్రామాలలో చేపట్టవలసిన కార్యాచరణపై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాలలో ఆర్ ఓ ఎఫ్ ఆర్ ద్వారా పోడు పట్టాలు పంపిణీ చేసిన గిరిజన రైతులకు ప్రధానమంత్రి జనజాతి గౌరవ ఉద్ధరణ అభియాన్ పథకం ద్వారా గొర్రెలు, మేకలు,
కోళ్ల పెంపకం వంటి సబ్సిడీ పథకాల యూనిట్లు గిరిజన రైతులు పొందే విధంగా గిరిజన గ్రామాలలో ముమ్మరంగా ప్రచారం చేసి ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదించే విధంగా సంబంధిత పశుసంవర్ధకశాఖ అధికారులు కృషి చేయాలని అన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ మార్గదర్శకాల ప్రకారము పోడుపట్టాకలిగిన గిరిజన రైతులను మరియు గిరిజన కుటుంబాలలో లబ్ధిదారులను ఎంపిక చేసి వారు ఎంచుకున్న పథకాలను అందజేసి వారి జీవనోపాధికి, ఆదాయ అభివృద్ధికి మరియు ఆదివాసి రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచి స్వయం ఉపాధి పథకాలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అన్నారు.
పోడు పట్టా కలిగిన గిరిజన రైతులు మీ పరిధిలోని సంబంధిత ఎంపీడీవోలను సంప్రదించి ప్రధానమంత్రి జన జాతీయ గౌరవ ఉద్ధరణ అభియాన్ పథకం నకు సంబంధించిన వివరాలు తెలుసుకొని మీ అభిరుచిని బట్టి మీకు కావలసిన పథకాలను ఎంపిక చేసుకొని దరఖాస్తుల సమర్పించాలని అన్నారు. సంబంధిత ఎంపీడీవోలు మరియు గ్రామ పంచాయతీ సెక్రెటరీలు గిరిజన గ్రామాలలో ముమ్మరంగా దండోరా (టముకు) ద్వారా ప్రచారం నిర్వహించి పోడుపట్టాగలిగిన గిరిజన రైతులను సబ్సిడీ ద్వారా లభించే ఈ పథకాల కొరకు అత్యధికంగా దరఖాస్తులు చేసుకునే విధంగా ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఏడి రవీంద్రనాథ్ ఠాగూర్, దుమ్ముగూడెం, చర్ల, అశ్వాపురం, బూర్గంపాడు మండలాలకు చెందిన పశువైద్యాధికారులు పాల్గొన్నారు.






