calender_icon.png 22 July, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో అధికారమే లక్ష్యం

11-08-2024 04:56:04 AM

  1. గ్రామ స్థాయి నుంచి పార్టీని నిర్మిస్తాం 
  2. త్వరలో టీటీడీపీకి అధ్యక్షుడిని నియమిస్తాం
  3. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
  4. ఏపీ తరహాలో కష్టపడాలని కార్యకర్తలకు దిశానిర్దేశం

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): తెలంగాణలో అధికారం చేపట్టడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, త్వరలో గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెడుతానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. 15 రోజుల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తామని, యువకులకు, బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తికాగానే టీటీడీపీ అధ్యక్షుడిని నియమి స్తామని వెల్లడించారు. పాత కమిటీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఉన్న కమిటీలను కూడా రద్దు చేసినట్టు చెప్పారు. ఏపీ, తెలంగాణలో ఒకేసారి కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఏపీ తరహాలో కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతినెల రెండో శనివారం, ఆదివారం తెలంగాణకు వస్తానని చెప్పారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు వచ్చిన చంద్రబాబుకు కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం సరి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని తెలిపారు. నాలుగు దశాబ్దాల్లో పార్టీ ఎత్తు పల్లాలు, విజయాలను గుర్తు చేసిన ఆయన అన్నింటిని ఎదుర్కొని నిలబడ్డామని చెప్పారు. అందరిని చూసేందుకు తాను వచ్చానని, పార్టీ కోసం కష్టపడ్డ వారికి తాను రావడం ఉత్సాహానిస్తుందని అన్నారు.