11-08-2024 05:49:23 AM
హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీని బీజేపీలో చేర్చుకొనే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. బీఆర్‌ఎస్‌తో బీజేపీ చర్చలని, బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అంటూ ఫేక్ న్యూస్ వ్యాపింపచేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ను కలుపుకొనే అవ సరం తమకు లేదని స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్ కాలం చెల్లిన పార్టీ అని ఎద్దేవా చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీజేపీలో విలీనం అంటూ బీఆర్‌ఎస్ నాటకం ఆడుతున్నదని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లను కాపాడుకునేందుకు యూరప్ ట్రిప్ పంపిస్తారనే చర్చపై మాట్లాడుతూ... బంగ్లాదేశ్ పంపిస్తే అక్కడ హిందువులపై ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో తెలుసుకుని వస్తారని అన్నారు.
ఆ అధికారులకే మళ్లీ ప్రాధాన్యం
రాష్ర్టంలో నిజాయితీగా పనిచేసే ఐఏఎస్‌లకు నేటికీ పోస్టింగ్ ఇవ్వడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు కొమ్ముకాసిన ఐఏఎస్, ఐపీఎస్‌లకే మళ్లీ మంచి పోస్టింగులిస్తున్నాని విమర్శించారు. కాంగ్రెస్‌కు, బీఆర్‌ఎస్‌కు తేడా లేకుండా పోయిందని అన్నారు. అతి తక్కువ టైంలో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకొన్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని ఎద్దేవా చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ అన్నారు. పంచాయతీలకు నిధులిచ్చే పరిస్థితి రాష్ర్ట ప్రభుత్వానికి లేదని, ఏకగ్రీవ పంచాయతీలకు కూడా ప్రోత్సాహక నిధులివ్వడం లేదని మండిపడ్డారు.
కేంద్ర నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నాయని తెలిపారు. ఎన్నికలంటూ వస్తే మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, జడ్పీటీసీలే తమ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి బీజేపీని గెలిపిస్తారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అనే మాటే ఉండదని, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోరు మాత్రమే ఉంటుందని స్పష్టంచేశారు. పంచాయతీలకు కేంద్రమే నిధులిస్తోందని హరీష్‌రావు ఇప్పటికైనా పేర్కొనడం శుభ పరిణామమని బండి అన్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొనుగోలు దందా బాధ్యతను కాంగ్రెస్ నేతకు అప్పగించి నడిపిస్తోందని విమర్శించారు. తమ్ముడి కోసమే రేవంత్‌రెడ్డి అమెరికా వెళ్లారని ఆరోపణ చేయడం సరికాదని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలని సూచించారు.
మేం ధర్మంగానే ఉంటాం
అప్పుడే కాంగ్రెస్‌లో లుకలుకలు మొదలయ్యాయని, ఆ పార్టీలో సంక్షోభం తలెత్తినా చీల్చి లాభం పొందాలనే దురాలోచన బీజేపీకి లేనేలేదని బండి సంజయ్ తెలిపారు. తాము నిఖార్సయిన రాజకీయాలే చేస్తామని అన్నారు. కాంగ్రెస్‌కు ప్రజలు ఐదేళ్ల అధికారమిచ్చారని, ఐదేళ్లు అధికారాన్ని ఉంచుకుం టారా, వదులుకుంటారా, అనేది ప్రభుత్వ తీరుపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పాతబస్తీలో రోహింగ్యాలున్న మాట వాస్తవమే కదా? అని ప్రశ్నించారు. అసదుద్దీన్ ఒవైసీ ఎన్ని వక్ఫ్ బోర్డు భూములను కాపాడారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒకచోట కొంత వక్ఫ్ భూమి ఉంటే ఊరు ఊరంతా వక్ఫ్ బోర్డు భూములేనని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఎంతమంది పేద ముస్లింలకు వక్ఫ్ భూములు ఇచ్చారో చెప్పాలని సవాల్ చేశారు. ప్రైవేట్ భూము లు కూడా చాలా చోట్ల వక్ఫ్ బోర్డులో ఉన్నాయని, పూర్తి విచారణ చేస్తే వివరాలు బయ టకొస్తాయని అన్నారు. గతంలో వక్ఫ్ బోర్డు భూములను కాంగ్రెస్, ఎంఐఎం నేతలు చాలా చోట్ల కబ్జా చేశారని, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొం దితే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని తెలిపారు. ముస్లిం తోపు లీడర్లు సైతం వక్ఫ్ భూములు కబ్జా చేసిన వారికే అండగా నిలిచారని విమర్శించారు. బీజేపీలో పార్టీకి, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉందనేది నిజం కాదని అన్నారు.
తన పార్లమెంట్ పరిధిలో 80 శాతానికి పైగా పోలింగ్‌తోపాటు బీజేపీకి ఆధిక్యం అందించిన పోలింగ్ బూత్ కమిటీలను త్వరలోనే సన్మానిస్తామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాన్నే కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల్లో ఆచరించి ఘన విజయం సాధించినట్లు బండి తెలిపారు. రాష్ర్ట అధ్యక్ష మార్పు జాతీయ అధ్యక్షుడు నడ్దా చూసుకుంటారని, హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యంగా పేర్కొన్నారు.
కేటీఆర్‌ను అరెస్టు చేయకుంటే యుద్ధమే
బీఆర్‌ఎస్ పాలనలో కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసని.. తనతోపాటు బీజేపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను సైతం కేటీఆర్ ఎంతో హిం సించారని బండి సంజయ్ విమర్శించారు. అందుకే ఖచ్చితంగా కేటీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ నిజాంలా పాలించారని, పోలీస్ స్టేషన్లలో వేసి దాడులు చేయించారని ఆరోపించారు.
కేటీఆర్‌ను అరెస్ట్ చేయకపోతే సీఎం రేవంత్‌రెడ్డిపై నమ్మకం పోతుందని, అప్పుడు కాంగ్రెస్‌తో జరగబోయేది యుద్ధమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటైనా బీజేపీ ధాటికి తట్టుకోలేనంతగా యు ద్ధం చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ వయసైపోయిందని, ఆయనను పొరపాటున అరెస్టు చేసినా అయ్యో పెద్ద మనిషి అని సానుభూతి వస్తుందని అన్నారు. కవిత బెయిల్‌కు, బీజేపీకి ఏం సంబంధం? సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీకి సంబంధముందా? కోర్టు విషయాలను కూడా మా పార్టీతో ముడిపెట్డడమేంటి? అని సంజయ్ ప్రశ్నించారు. గతంలో కేటీఆర్, ఇప్పుడు రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనల వల్ల రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీలేదని విమర్శించారు.