08-07-2025 12:00:00 AM
ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్..
హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర నాయకులు
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): పాలక, ప్రతిపక్షపార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరలేపిన బనకచర్లపై ప్రభుత్వం ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈక్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పీపీటీ) ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటోంది. పీపీటీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను ప్రజల ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నది.
ఈ నేపథ్యంలో ఈ నెల 9న ప్రజాభవన్‌లో ప్రజెంటేషన్ ఇవ్వనున్నది. తద్వారా బీఆర్‌ఎస్ పార్టీని ఇరుకునపెట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం, నాణ్యత, అంచనాల వ్యయం, అవినీతి ఆరోపణలపై ఆధారాలతో సహా ప్రజల ముందు వాస్తవాలను ఉంచే లక్ష్యంతో ప్రజెంటేషన్ ఇవ్వనున్నది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇవ్వనున్న పీపీటీకి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
రుణాలను చెల్లించాలని..
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన అప్పులు రాష్ర్ట ప్రభుత్వానికి భారంగా మారాయని విమర్శిస్తున్న కాంగ్రెస్ వాదనకు బలం చేకూరుస్తూ ప్రాజెక్టు కోసం ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించాలంటూ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి.