08-07-2025 12:48:50 AM
- గతానికి, ఇప్పటికీ మారిన రాజకీయ సమీకరణాలు
- స్థానిక ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం యువతకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తాం
- 20 రోజుల్లో పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ఏర్పాటు పార్టీలో గ్రూపులు లేవు.. అంతా మోదీ గ్రూపే
-మీడియాతో బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు చిట్‌చాట్
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ సమీకరణాలు మారుతున్నాయని.. ఉప ఎన్నిక తమకు ఛాలెంజ్ అయి నప్పటికీ గెలుపు మాత్రం తమదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. కోర్ బీజేపీ ఓటర్లు, కోర్ ముస్లిం ఓటర్లు గత ఎన్నికల సమయంలో పలు కారణాలతో బీఆర్‌ఎస్‌కు షిఫ్ట్ అయినట్లు కనిపించిందని.. ఇప్పు డు ఆ సమీకరణాలు ఉండబోవని తెలిపారు.
ఇప్పుడు ప్రజలు మారిపోయారని ముస్లిం ఓట్లు పోలరైజ్ అయ్యే ఛాన్స్ లేదని పేర్కొన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. గత ఎన్నికలకు ఇప్పటికీ సమీకరణాల్లో, పరిస్థితుల్లో చాలా తేడాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి కనిపిస్తోందని..దాని ప్రభా వం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా ఉంటుందన్నారు.
ఉప ఎన్నికలెప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగా ఉండవని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పోటీ చేస్తుందా లేదా బీఆర్‌ఎస్‌కు సపోర్ట్ చేస్తుం దా లేక కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉందన్నారు. దేశవ్యాప్తంగా ముస్లింలకు తానే నాయకుడినని అనిపించుకునేందుకు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ భావిస్తున్నారని ఆరోపించారు.
మొదటిసారి బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నట్లు రాంచందర్‌రావు తెలిపారు. గుజరాత్ లో ప్రతి ఎన్నికను బీజేపీ సీరియస్‌గా తీసుకొని పోటీచేస్తుందని..అదే తరహాలో తెలంగాణలో ప్రతీ ఎన్నిక సీరియస్‌గా తీసుకో బోతున్నామని ఆయన స్పష్టం చేశారు. స్థానికంలో గెలిచేందుకు ఎక్కువగా యువతకు అవకాశం కల్పిస్తామన్నారు.
పార్టీ కోసం కష్టపడే వారికి ఎప్పుడూ మెరుగైన అవకాశాలుంటాయన్నారు. 20 రోజుల్లోగా కొత్త రాష్ట్ర వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసుకుంటామని..పార్టీ కీలక నేతలతో చర్చించి రాష్ట్ర కమిటీ వేస్తామన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలు, దక్షిణ తెలంగాణ ప్రాంతాలపై ఫోకస్ పెంచుతామని తెలిపారు. పార్టీ తల్లి లాంటిదని..ఎవరూ మోసం చేయవద్దని పార్టీ నేతలకు సూచించారు. బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవని అందరూ నరేంద్ర మోదీ గ్రూపు అని తెలిపారు.