calender_icon.png 8 July, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీలో మహిళలకు కోటా 60 సీట్లిస్తాం

08-07-2025 12:52:40 AM

- నియోజకవర్గాల పునర్విభజనలో పెరగనున్న సీట్లు

- మహిళలకు 51స్థానాలు.. మరో 9 సీట్లు కేటాయించి 60 మందికి అవకాశమిస్తాం

- మహిళా సంఘాల్లో చేరేందుకు వయసును 15 ఏళ్లకు సడలిస్తాం

ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం

ప్రతీ తల్లి తమ పెరట్లో రెండు మొక్కలు నాటాలి

జయశంకర్ యూనివర్సిటీలో వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

రంగారెడ్డి, జూలై 7 (విజయక్రాంతి)/మణికొండ : రాష్ట్రంలో డీలిమిటేషన్‌లో భాగంగా అసెంబ్లీ స్థానాలు 153కు పెరుగుతాయని, వీటిలో మహిళలకు చట్టప్రకా రంగా 51 స్థానాలు వస్తాయని మరో 9 సీట్లు కేటాయించి 60మందికి  అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మహిళలు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తే పదవులు వారి ముందుకే వస్తాయని, 60 మంది మహిళలను గెలిపించి చట్టసభలోకి తీసుకొచ్చే బాధ్యత తనదే అంటూ సీఎం వారిలో ఉత్సాహం నింపారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు ఈ ఏడాది 18 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకొని ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన వివరిం చారు.

ప్రతి తల్లి తమ పెరట్లో రెండు మొక్కలు నాటి పెంచాలని సీఎం పిలుపునిచ్చారు. తల్లులు మొక్కలు నాటితే తమ పిల్లల్ని చూసుకున్నట్లే జాగ్రత్తగా చూసుకుంటారని, పిల్లలు కూడా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు తమ తల్లుల పేరి టా రెండు మొక్కలు నాటి సంరక్షించాలని ఆయన కోరారు.

సోమవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 11వ వనమహోత్సవం కార్యక్ర మాన్ని సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించి యూనివర్సిటీ ప్రాంగణం లో రుద్రాక్ష మొక్కను నాటారు. అటవీశాఖ హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బొటానికల్ గార్డెన్‌లో ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.. ‘మనమే వనం.. వనమే మనం’ అని, ప్రకృ తిని పరిరక్షిస్తే మనల్ని ప్రకృతి పరిరక్షిస్తుందని పెద్దలు చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్రంలో మహిళలకు అభివృద్ధి సంక్షేమంలో పెద్దపీట వేస్తున్నామని అందుకే ఆదర్శ పాఠశాలల బాధ్యతలను మహిళలకు అప్పగించామని చెప్పారు.

పిల్లల అటెండెన్స్ పంతులు తీసుకుంటే పంతుల అటెండెన్స్ మహిళా సంఘాల సభ్యులు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మహిళా సంఘాలకు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి బాధ్యతలు అప్పగించామన్నారు. హైటెక్ సిటీలో విప్రో, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఉండే చోట మూడు ఎకరాల్లో ఇందిరాశక్తిని ఏర్పాటు చేసి మహిళా సంఘాలు తయారుచేసిన వస్తువులను మార్కెటింగ్ చేసే సదుపాయం కల్పించామన్నారు.

అంతర్జాతీయ కంపెనీలతో వ్యాపారంలో మహిళా సంఘాల సభ్యులు పోటీపడేలా వారికి ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. మహిళా సంఘాల సభ్యులు చేస్తున్న వ్యాపారంపై వారి కృషిని అభినందిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రత్యేక కథనాలు రాయాలని జర్నలిస్టులను కోరారు. మహిళా సంఘాల్లో చేరేందుకు వయసును 15 ఏళ్లకు సడలింపు చేపడతామని త్వరలోనే చట్టం తీసుకొస్తామన్నారు. ఈ ఏడాది మహిళలకు రూ.21వేల కోట్ల రుణాలు అందించామని తెలిపారు. 

ఆడబిడ్డలను కాపాడుకోవడమే ఇందిరమ్మ రాజ్యం..

ఆడబిడ్డలను కాపాడుకోవడమే ఇందిరమ్మ రాజ్యమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తమ ఇంటిని ఎంత బాధ్యతగా చక్కదిద్దుకుంటారో అంతే బాధ్యతగా రాజ్యా న్ని చక్కదిద్ది పాలిస్తారని  మహిళలపై ఆయ న ప్రశంసల జల్లు కురిపించారు. రాజీవ్‌గాంధీ కృషి వల్లనే స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు మనగడలోకి వచ్చిందని, దాని ఫలితంగా ఎంతోమంది మహిళలు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అయ్యారని.. పట్నం సునీతామహేందర్‌రెడ్డి నాలుగు సార్లు రంగారెడ్డి జిల్లాకు జడ్పీ చైర్‌పర్సన్ అయ్యారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం మహిళలకు ఐదేళ్లు మంత్రివర్గంలో చోటు కల్పించలేదన్నారు.

ఉద్యమంలా వనమహోత్సవం..: మంత్రి కొండా సురేఖ

రాష్ట్రంలో జీవవైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. వన మహోత్సవాన్ని ఒక ఉద్యమంలా ముందు తీసుకెళ్తేనే భవిష్యత్తు బాగుంటుందని అన్నా రు. ప్రభుత్వ చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పీసీసీఎఫ్ అధికారి సువర్ణ, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్ పాల్గొన్నారు.