calender_icon.png 8 July, 2025 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐసెట్ ఫలితాలు విడుదల

08-07-2025 12:00:00 AM

  1. 90.83 శాతం ఉత్తీర్ణత

వచ్చే నెలలో కౌన్సెలింగ్

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ ఐసెట్ ఫలితా ల్లో 90.83 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ వీ బాల కిష్టారెడ్డి, వైస్‌చైర్మన్లు ప్రొఫెసర్ పురుషోత్తం, మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్, ఎం జీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ ఏ రవితో కలిసి ఫలితాలను సోమవా రం విడుదల చేశారు.

71,746 మంది దరఖాస్తు చేసుకోగా, 64,938 మంది పరీక్ష రాశారు. ఇందులో 58,985 మంది అర్హత సాధించారు. మొత్తం వచ్చిన దరఖాస్తుల్లో తెలంగాణ నుంచి 68,137 మంది ఉండగా, అన్‌రిజర్వుడ్ అభ్యర్థులు 3,609 మంది ఉన్నారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో పురుషులు 27,998 కాగా, మహిళలు 30,986 మంది ఉన్నారు. ఈసారి ఆగస్టులోనే ప్రారంభిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు. 

టాప్ ర్యాంకర్లు వీళ్లే..

ఐసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థి అర్ల క్రాంతికుమార్‌కు మొదటి ర్యాంకు వచ్చింది. రెండో ర్యాంకు కామారెడ్డికు చెందిన వీ సాయికృష్ణ, మూడో ర్యాంకు మహబూబాబాద్‌కు చెందిన కోటగిరి కౌశిక్, నాలుగో ర్యాంకు హైదరాబాద్‌కు చెందిన టీవీఎస్ క్రిష్ణవర్ధన్, ఐదో ర్యాంకు జగిత్యాలకు చెందిన ఇ వైష్ణవి, ఆరో ర్యాంకు మేడ్చల్‌కు చెందిన సీ మణికంఠరెడ్డి, ఏడో ర్యాంకు ఏపీకు చెందిన పూజారి ఇంద్రసేన, ఎనిమిదో ర్యాంకు నల్లగొండకు చెందిన వడ్డేపల్లి శ్రీనివాసగౌడ్, తొమ్మిదో ర్యాంకు మేడ్చల్‌కు చెందిన ఎస్ శివజ్యోత్స్న, పదో ర్యాంకు వనపర్తికు చెందిన టీ అరుణ్ కుమార్ సాధించారు.

కాలేజీలకు అనుమతులివ్వండి..

మహాత్మాగాంధీ వర్సిటీను పూర్తిస్థాయి వర్సిటీగా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటు న్నామని ఆ వర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మీడియాతో పేర్కొన్నారు. బీ ఫార్మసీ, లా కాలేజీ, బీపీఈడీ, డీపీఈడీ విభాగాలకు అనుమతులివ్వాలని, అదేవిధంగా పోస్టులను కూడా మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ఈ వర్సిటీ పాలకమండలిలో తీసుకున్న పలు నిర్ణయాలు ముందుకు సాగడం లేదని తెలిసింది.