కార్ల్‌సన్‌కు ప్రజ్ఞానంద షాక్
స్టావెంజర్ (నార్వే): పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరోసారి సంచలనం సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ టోర్నమెంట్‌లో ప్రజ్ఞానంద.. స్థానిక ఆటగాడు, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్లసన్‌ను చిత్తు చేశాడు. గురువారం జరిగిన క్లాసికల్ గేమ్‌లో ప్రజ్ఞానంద 37 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ను ఓడించాడు. ఇప్పటికే పలుమార్లు ర్యాపిడ్, ఎగ్జిబిషన్ గేముల్లో కార్ల్‌సన్‌ను చిత్తు చేసిన ప్రజ్ఞానందకు క్లాసికల్ చెస్ గేమ్‌లో మాత్రం కార్ల్‌సన్‌పై ఇదే తొలి విజయం. ఆట ఆరంభంలో కార్ల్‌సన్ చేసిన కొన్ని తప్పులను ఆసరగా చేసుకున్న ప్రజ్ఞానంద ఆ తర్వాత తన ప్రత్యర్థికి అవకాశమివ్వలేదు.
కార్ల్‌సన్ ఎత్తులకు పైఎత్తులు వేసిన ప్రజ్ఞానంద వ్యూహాత్మక విజయాన్ని అందుకున్నాడు. ఈ విజయంతో ప్రజ్ఞానంద 5.5 పాయింట్లు సాధించి పురుషుల విభాగంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. టోర్నీ ప్రారంభానికి ముందు కార్ల్‌సన్ తనకు పోటీయే కాదని ప్రకటించిన ప్రజ్ఞానంద దాన్ని ఆచరణలో చేసిచూపాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఫాబియానో కరునా (అమెరికా).. చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లారెన్‌పై తొలి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. హికారు నకాముర (అమెరికా) ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ ఫిరౌజా అలీరెజాను ఓడించాడు. ఇక మహిళల విభాగంలో ఆర్. వైశాలీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. అన్నా ముజిచుక్ (ఉక్రెయిన్)తో క్లాసికల్ గేమ్‌ను డ్రా చేసుకున్న వైశాలీ కీలకమైన ఆర్మ్‌గెడాన్‌లో ముందంజ వేసింది. తెలుగు తేజం కోనేరు హంపి చైనా గ్రాండ్‌మాస్టర్ టింగ్ లీపై గెలిచింది.






