31 July, 2026 | 3:27 AM

పొగేసి పోగుచేసి!

29-05-2024 12:52 AM

సకల జనుల సమ్మెకు సెగ పుట్టించిన సింగరేణి

నిర్బంధాలు ఛేదించుకుని నిప్పు కణికలై.. 

రాష్ట్రం కోసం 42 రోజుల నిరసన చరిత్రాత్మకం 

పదేళ్ల తెలంగాణ ఉత్సవాల వేళ... ఉద్యమాభివందనం

మంచిర్యాల, మే 28 (విజయక్రాంతి) : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర ప్రత్యేకమైనది. సాధారణంగా కార్మికులు ఎవరు సమ్మె చేసినా తమ వేతనాలో, అలవెన్సుల కోసమే సమ్మె బాట పట్టిన సందర్భాలే ఎక్కువ. కానీ ఒక రాష్ట్ర ఉద్యమంలో కార్మికులు పాల్గొనడం కేవలం తెలంగాణ సింగరేణి కార్మికులకే దక్కుతుంది.

స్వరాష్ట్ర సాధన కోసం తట్టా,  చెమ్మాస్ వదిలేసి ఒక్క బొగ్గు పెల్ల కూడా బయటకు రాకుండా చేసి ఉద్యమానికి మరింత సెగ పెంచిందని చెప్పుకోవాలి.  2011, సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 35 రోజుల పాటు నిర్విరామంగా సింగరేణి వ్యాప్తంగా సమ్మె జరగటం, అది తెలంగాణలోని సబ్బండ వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడం సకల జనుల సమ్మెకు బలం చేకూర్చినట్లయింది. ఫలితంగా తెలంగాణ ఉద్యమం మరింత ఎగిసిపడేలా సింగరేణి కార్మికుల సమ్మె స్ఫూర్తిగా నిలిచిందనే అభిప్రాయాలు ఇప్పటికీ ఉన్నాయి. 

నిర్బంధాలు పెట్టినా.. మడమ తిప్పకుండా..

కోల్‌బెల్ట్‌లో ఎన్ని నిర్బంధాలు అమలు చేసినా కార్మికులు మడమ తిప్పకుండా పోరాడారు. నెల రోజులకుపైగా సమ్మె చేయడంతో కార్మికుల కుటుంబాలు ఇబ్బంది పడ్డా ఎక్కడా ఒక్క అడుగు వెనక్కి తగ్గలేదు.  కుటుంబ సభ్యులు సైతం కార్మికులకు అండగా ఉండి పోరాటంలో తమవంతు పాత్ర పోషించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాలోనూ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సింగరేణి సమ్మె వల్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. దాదాపు నాలుగు వేల చిన్నాపెద్ద పరిశ్రమల మీద సమ్మె ప్రభావం పడి మూతపడే పరిస్థితి నెలకొంది.

దీనితో  సమ్మె సెగ ఢిల్లీ సమీప నోయిడా నుంచి మొదలు సౌత్ ఇండియా వరకు తాకింది. సమ్మెను విరమించాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఉద్యమనేత, టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రామ్, సింగరేణి జేఏసీ కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు. స్వరాష్ట్ర సాధన కోసం చేసిన నిరసనలలో సింగరేణి కార్మికుల సమ్మె ప్రభావమే ఎక్కువ. సింగరేణి తర్వాత ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎఫెక్ట్‌నిచ్చింది.

కార్మికుల సమ్మె ఎఫెక్ట్‌తో...

తెలంగాణ ప్రజల ఆకాంక్షను స్టడీ చేసిన దివంగత సుష్మాస్వరాజ్ కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర ఎంతో కీలకమైందని ప్రశంసించారు. కార్మికుల సమ్మె ఎఫెక్ట్, కేసీఆర్ దీక్ష, జేఏసీ చైర్మన్ కోదండరాం, సింగరేణి జేఏసీ చైర్మన్ ఎండీ మునీర్ తదితర ఉద్యమకారుల పోరాటం, ఆర్టీసీ కార్మికులు, కుల సంఘాలు, దాదాపు అన్ని రాజకీయ పార్టీల కృషి, తెలంగాణలోని ఎంపీల ఒత్తిడి తదితరాల వల్ల ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రానికి మొగ్గు చూపిందని చెప్పవచ్చు.

ప్రత్యేక రాష్ట్రం కోసం 42 రోజులు నిరసనలు...

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సింగరేణి కార్మికులు 2011, సెప్టెంబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు 35 రోజుల పాటు సమ్మె కొనసాగడం చరిత్రాత్మకం. కేసీఆర్ ఆమరణ దీక్ష నేపథ్యంలో ఆయన్ను దీక్షా శిబిరం వద్దకు వెళ్లనీయకుండా 2009, నవంబర్ 29న క  రీంనగర్ జిల్లా అల్గునూరు చౌరస్తాలో అరెస్టు  చేసినందుకు నిరసనగా  75 వేల మంది సింగరేణి  కార్మికులు ఐదు రోజుల పాటు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు.

పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు  నిర్వహించారు. సింగరేణి కార్మికుడి కుమారుడు శ్రీకాంతాచారి ఆత్మహత్య సందర్భంగా సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. రాష్ట్రంలో శ్రీకృష్ణ కమిటీ పర్యటన సందర్భంగా రెండు రోజుల పాటు సమ్మె చేసి తెలంగాణ డిమాండ్‌ను దేశమంతా తెలిసేలా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని సింగరేణిలో ఉద్యమించారు. ఇలా మొత్తం సకల జనుల సమ్మెతో కలుపుకొని సింగరేణి కార్మికులు తెలంగాణ కోసం 42 రోజులు సమ్మె చేశారు. 

సింగరేణి కార్మికుల సమ్మె ఒక చరిత్ర

తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి బొగ్గు గని కార్మికుల పాత్ర కీలకం.  రాష్ట్ర సాధ్యన కోసం 42 రోజుల పాటు సమ్మె చేసి తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని మార్చేశారు. పోరాటాలు, త్యాగాలకు సింగరేణి కార్మికులు ముందుంటారు. కార్మికులతో పాటు అధికారులు సైతం కార్మికుల వెంట నడిచారు. అప్పుడు అధికారంలో ఉండి ఉద్యమకారులను ఇబ్బందులపాలు చేసిన ఎందరో ఈ రోజు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉండటం ఉద్యమకారులు జీర్ణించుకోలేకపోతున్నారు.

బొగ్గుకు ఎలాగైతే మండే గుణం ఉంటుందో భూగర్భంలోకి వెళ్లి బొగ్గును బయటకు తీసుకొస్తున్న కార్మికుల సమస్యలు ఇంకా పరిష్కారం కాకుండా మండుతూనే ఉన్నాయి. డిపెండెంటు ఉద్యోగం కార్మికుల ఇన్వ్యాలిడేషన్ ద్వారా ఇస్తున్నారు, మనిషికి బదులుగా మనిషికే ఉద్యోగం లభిస్తుంది. కొత్తగా రిక్రూట్‌మెంట్ తక్కువ ఉంది. ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కొత్త గనుల ప్రారంభానికి, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సింగరేణిపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.

 ఎండీ మునీర్, 

సింగరేణి జేఏసీ చైర్మన్

కార్మికులకు ఐటీ మినహాయింపు ఇవ్వాలి 

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కార్మిక రంగం కదం తొక్కి సమైఖ్య వాద శక్తులను, పార్టీలను మట్టి కరిపించింది. తెలంగాణ ప్రాంత ప్రజల జీవితాలు మార్చాలనే ఉద్దేశంతో చేసిన ఏకైక దీర్ఘ సమ్మె సకల జనుల సమ్మె. తెలంగాణ రాష్ట్ర సాధ స సమస్యను ఉద్యమ రూపంగా మార్చింది సింగరేణి కార్మికులు. ఊగిసలాటలో ఉన్న నాయకులు ఖచ్చితంగా ఇవ్వాలనే స్థాయికి కార్మికులు తీసుకొచ్చారు.

ఈ సమ్మె కాలంలో కేసీఆర్ నాయకకత్వంలో నాతోపాటు ప్రొఫెసర్ కోదండ రాం, ఆర్టీసీ జేఏసీ అశ్వథ్థామరెడ్డి, స్టూడెంట్ జేఏసీ, ఇతర నేతలందరు 2011, అక్టోబర్ 3న అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసిన సమయంలోనే, సింగరేణి కార్మికుల సమ్మె తర్వాత కచ్చితంగా తెలంగాణ  ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చామని చెప్పడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ లాంటి నాయకుడు సింగరేణి కార్మికుల కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్నా తప్పులేదని చెప్పడమే సింగరేణి కార్మికుల ఉద్యమ స్వరూపానికి నిదర్శనం. రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అవుతున్నా సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు ఇవ్వకపోవడం బాధాకరం. సింగరేణి కార్మికులకు, ఉద్యమకారులకు, అధికారులకు ఉద్యమాభివందనాలు.

 కెంగర్ల మల్లయ్య, 

మాజీ అధ్యక్షుడు, టీబీజీకేఎస్