28 July, 2026 | 1:59 AM

ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

28-07-2026 01:39 AM

కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, జూలై 27 (విజయక్రాంతి): ప్రజావాణి ద్వారా అందిన ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులను 30 రోజుల్లోగా, అప్పీల్ కేసులను మూడు రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

సమస్యలు పునరావృత్తం కాకుండా శాశ్వత పరిష్కారాలు చూపాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి వివరాలను పోర్టల్లో ఎప్పటికప్పుడు నవీకరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, ఉపాధి హామీ, భూభారతి తదితర సమస్యలపై 97 అర్జీలు అందినట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం పదేళ్లుగా పరిష్కారం కాని తన పట్టా భూమి సమస్యను పరిష్కరించినందుకు గాను భీంపూర్ గ్రామానికి చెందిన భారే కళావతి, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలెక్టర్ను ఈ సందర్భంగా సన్మానించారు.

29న జీపీల పాలనపై ప్రత్యేక సమీక్ష

గ్రామ పంచాయతీల అభివృద్ధి, పాలనా పురోగతిపై ఈ నెల 29న మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రతి 45 రోజులకు ఒకసారి ఈ సమావేశాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో జీపీ యాప్ నిర్వహణ, తడి-పొడి చెత్త వేరుచేసే విధానం, పారిశుధ్యం, జల్ జీవన్ మిషన్, ఇందిరమ్మ ఇళ్లు, సీజనల్ వ్యాధుల నివారణపై చర్చించనున్నామన్నారు.

తహసీల్దార్లు, వైద్యులు, వ్యవసాయ అధికారులతో సహా ముఖ్య శాఖల అధికారులు ఈ సమావేశాలకు హాజరుకావాలని, చర్చించిన వివరాలను నివేదిక రూపంలో డీపీఓ, జడ్పీ సీఈఓలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఆర్‌ఎస్ చిత్రు, రాజేశ్వర్, ఏవో వర్ణ, జడ్పీ సీఈఓ రవి, డీపీఓ రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.