calender_icon.png 4 September, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్ వెంకటేష్ దోత్రే

01-09-2025 05:51:05 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టర్ భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఆసిఫాబాద్ మండలం బూర్గుడ గ్రామంలోని ఎస్. సి. కాలనీకి చెందిన చిలారి శిల్ప రాణి తనకు దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఆసిఫాబాద్ పట్టణం పైకాజీ నగర్ కు చెందిన నైతం మోహన్ తన కూతురు రాజేంద్రప్రసాద్ బిఈడి కళాశాలలో చదివినందున ధ్రువపత్రాలు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్ మండల కేంద్రానికి చెందిన పెరుమాండ్ల వెంకటేష్ జనకాపూర్ శివారులో తనకు గల భూమికి పట్టా పాసు పుస్తకం జారీ చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

ఆసిఫాబాద్ మండలం గోవిందపూర్ గ్రామానికి చెందిన విలాస్ తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్ మండలం జనకాపూర్ కు చెందిన సమీనా బేగం తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. తిర్యాణి మండలం తలండి గ్రామానికి చెందిన పెట్టం రాజలింగు తమ తండ్రి పేరిట గల భూమికి పట్టా పాసు పుస్తకం జారీ చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కౌటాల మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన మొర్లే పాండు మేర తన తండ్రి పేరు గల భూమిని ఆయన మరణించినందున తమ పేరిట విరాస పట్టా మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని, దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.