మియాపూర్ సర్కిల్‌లో 17 ప్రజావాణి ఫిర్యాదులు
శేరిలింగంపల్లి, జూన్ 29 (విజయక్రాంతి): మియాపూర్ సర్కిల్-48 కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 17 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఎక్కువ భాగం టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించినవే కావడం గమనార్హం. అధికారుల సమాచారం ప్రకారం,17 ఫిర్యాదుల్లో 16 ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్ విభాగంపై నమోదయ్యాయి. ఒక్క ఫిర్యాదు మాత్రమే ఇంజినీరింగ్ విభాగానికి చెందింది.
రెవెన్యూ, హెల్త్, శానిటేషన్తో పాటు ఇతర విభాగాలకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు.ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులన్నింటినీ త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తమ వ్యక్తిగత, భూమి సంబంధిత, నిర్మాణ అనుమతులు, ఇతర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
టౌన్ ప్లానింగ్ విభాగంపై ఎక్కువ ఫిర్యాదులు రావడం వెనుక స్థానికంగా భూమి, భవనాల నిర్మాణాలు, లేఔట్ నియమాల అమలు వంటి అంశాలు ప్రధాన కారణాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి అందిన అన్ని ఫిర్యాదులను వివిధ విభాగాల అధికారులు సమీక్షించి, నిర్ణీత గడువులోగా పరిష్కారం చేస్తామని మియాపూర్ సర్కిల్ అధికారులు తెలిపారు.






