30 June, 2026 | 2:55 AM

ఇద్దరిలో ఒక్కరి నుంచే ఈహెచ్‌ఎస్ చందా

30-06-2026 02:03 AM

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): ఉద్యోగులు, పెన్షనర్ల ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్‌ఎస్) అమలుకు సంబంధించిన కీలక ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే అందులో ఒక్కరి నుంచే ఈహెచ్‌ఎస్‌కు వేతనాల నుంచి మినహాయింపు (కటింగ్) అవుతుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ప్రాథమిక వేతనం/ప్రాథమిక పెన్షన్‌లో 1.5 శాతం చొప్పున కట్ అయి ఈహెచ్‌ఎస్ ట్రస్టుకు చందా మినహాయించబడుతుంది.

ఈ మినహాయింపు మేబె2026 జీతం/పెన్షన్ (జూన్ చెల్లింపుల నుంచి) అమల్లోకి వస్తుందని, ప్రతి నెల వేతనాల నుంచి కట్ అవుతుందని పేర్కొంది. ఉద్యోగులు, పెన్షనర్లు చెల్లించే చందాకు ప్రభుత్వం కూడా అంతే సమాన మొత్తాన్ని ఈహెచ్‌ఎస్ ట్రస్టుకు అందిస్తుంది. ఈ మినహాయించిన మొత్తం ప్రత్యేక ఈహెచ్‌ఎస్ ఫండ్ ఖాతాలో జమ చేస్తారు. దీనిని వైద్యం కోసం ఉపయోగిస్తారు. 

చందా మినహాయింపు ఇలా.. ఇద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే.. ప్రభుత్వ ఉద్యోగి, మరొకరు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ అయితే. పెన్షనర్‌కు సర్వీస్ పెన్షన్‌తో పాటు ఫ్యామిలీ పెన్షన్ కూడా వస్తున్నట్లయితే.. ఈ మూడు సందర్భాల్లో ఒక్కరి నుంచే 1.5 శాతం ఈహెచ్‌ఎస్ చందా మినహాయింపు ఉంటుంది. పొరపాటున ఇద్దరి నుంచి చందా వసూలు చేస్తే ఆ మొత్తాన్ని తిరిగి ఉద్యోగి, పెన్షనర్‌కు చెల్లించాలి.