30 June, 2026 | 2:27 AM

ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం

30-06-2026 02:04 AM

ప్రభుత్వ విప్ వేముల వీరేశం

సూర్యాపేట రూరల్, జూన్ 29: ప్రతి ఎకరానికి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలు అన్నారు. సోమవారం వారు సూర్యాపేట మండలం రత్నాపురం వద్ద మూసీ ప్రాజెక్టు ఎడమకాల్వకు సాగునీటిని విడుదల చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. మూసీ ఆయకట్టు కింద ఉన్న పొలాలకు రెండు విడతలుగా నీరందిస్తామని, ఈ వానాకాలంలో ప్రాజెక్టు కింద దాదాపు 35 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాల వల్ల మూసీ ప్రాజెక్టులోకి సమృద్ధిగా నీరు చేరిందని, ప్రస్తుతం ప్రాజెక్టులో 4 టీఎంసీల నీటి నిల్వ ఉందని వివరించారు.గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కోట్ల రూపాయలతో ఎడమ కాల్వల మరమ్మతులు, క్రస్ట్గేట్ల పనులు పూర్తి చేశామని గుర్తుచేశారు.

భవిష్యత్తులో మూసీ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్ట్ అయిన ’మూసీ నది ప్ర క్షాళన’ను ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అధిగమించి పూర్తి చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.