calender_icon.png 23 February, 2026 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలి

23-02-2026 06:51:37 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆమె స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు.

మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను కలెక్టర్ కు సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ...  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వ విద్యా సంస్థలు, వసతి గృహాలు తనికి చేస్తూ ఉండాలని తెలిపారు. వేసవి కాలం సమీపిస్తున్నందున విద్యార్థులకు నీటి సమస్యలు తలెత్తకుండా తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలల మౌళిక సదుపాయాల కల్పన పనులు, మరమ్మత్తులు, మరుగుదొడ్ల నిర్మాణాలు, అంగన్వాడి భవన నిర్మాణ పనులు, మండల ప్రత్యేక అధికారులు పరిశీలిస్తూ, నిర్మాణాల ప్రగతి, నాణ్యత పరిశీలిస్తూ ఉండాలని తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో శంకర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.