calender_icon.png 23 February, 2026 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా కట్టుబడి పనిచేస్తున్నాం

23-02-2026 06:57:02 PM

- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

- బాలవికాస్,అమెజాన్ ఆధ్వర్యంలో మార్కజీ పాఠశాలకు రూ.8 లక్షల విలువైన 20 ల్యాప్‌టాప్‌ల పంపిణీ

హనుమకొండ, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హనుమకొండలోని ప్రభుత్వ మర్కజ్ ఉన్నత పాఠశాలలో బాలవికాస్ సేవాసంస్థ మరియు అమెజాన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రూ.8 లక్షల విలువైన 20 ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు పంపిణీ చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. నిర్మాణంలో ఉన్న పాకశాల భవనాన్ని పరిశీలించి, పనులు మధ్యంతరంగా అసంపూర్తిగా ఉన్నాయని తక్షణమే ఎమ్మెల్యే నిధులనుంచి 5 లక్షలను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంలో వెనుకబడకూడదనే ఉద్దేశంతో కార్పొరేట్ సంస్థలు, సేవా సంస్థల సహకారాన్ని సమన్వయం చేస్తున్నామని తెలిపారు. బాలవికాస్ సంస్థ సేవా దృక్పథాన్ని అభినందిస్తూ, గ్రామీణ వాతావరణం కలిగిన సోమిడి, దర్గా, వడ్డేపల్లి, శాయంపేట ప్రాంతాల పాఠశాలల్లో కూడా మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని కోరినట్లు చెప్పారు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేక నిధులు కేటాయించి తరగతి గదుల మరమ్మతులు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు వంటి పనులు చేపట్టామని వెల్లడించారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం కంప్యూటర్ విద్య, ఆంగ్ల భాషా ప్రావీణ్యం, పోటీ పరీక్షల దిశగా మార్గదర్శక శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.

హనుమకొండ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివి ఉన్నత స్థానాలకు ఎదిగిన పూర్వ విద్యార్థులు తమ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాల బలపడితేనే సమాజం బలపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు విష్ణురెడ్డి , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్,కార్పొరేటర్ పోతుల శ్రీమాన్,బాల వికాస్ సంస్థ ప్రతినిధి షౌర్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు శివాజీ,బాలవికాస్ ప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.