16 May, 2026 | 10:49 PM

బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్

16-05-2026 10:07 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో భారతీయ జనతా పార్టీ నాయకులను పోలీస్ లు ముందస్తు అరెస్ట్ చేశారు.జగిత్యాలలో నవోదయ పాఠశాల, కేంద్రీయ విద్యాలయాల నిర్మాణానికి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఇందూర్ పార్లమెంట్ సభ్యుడు చేపట్టనున్న ధర్మ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో జిల్లా లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్షకు మద్దతుగా జగిత్యాల ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు మల్లాపూర్ మండలం నుంచి బయలుదేరిన బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టైన వారిలో వేంపెల్లి సర్పంచ్ రాజేందర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు పందిరి నాగరాజు, మండల బీజేపీ ఉపాధ్యక్షుడు లవంగం శివ, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గజ్జి శ్రీనివాస్, సీనియర్ నాయకులు ముద్ధం సత్యనారాయణ, ఉట్నూరి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మల్లాపూర్ బీజేపీ మండల శాఖ నాయకులు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేపడుతున్న శాంతియుత నిరసనలకు కూడా అనుమతి ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి జగిత్యాల జిల్లా కేంద్రంలో నవోదయ పాఠశాల కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు.