9 April, 2026 | 5:01 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

సన్నాలే సరి

08-12-2024 01:13 AM

ప్రభుత్వమే కొంటుంది.. అన్నదాతలకు నిశ్చింత

  1. కేసీఆర్ పాలనలో నల్లగొండకు అన్యాయం 
  2. ఎవరు అడ్డుకున్నా మూసీ ప్రక్షాళన ఆగదు   
  3. సంక్రాంతి తరువాత రైతుభరోసా.. అప్పుడు బీఆర్‌ఎస్ నేతల గుండెలు గుబేలే! 
  4. నల్లగొండలో ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి  

* గెలిస్తే పాలిస్తాం.. ఓడితే ఫాంహౌస్‌లో పడుకుంటామన్న ధోరణి కేసీఆర్‌కు మంచిది కాదు.

* జేపీ నడ్డా వాస్తవాలను తెలుసుకోకుండా తెలంగాణ గడ్డపై అడ్డగోలుగా మాట్లాడటం సరికాదు. హరీశ్ మాటలనే కిషన్‌రెడ్డి, ఈటెల కాపీ కొడుతున్నారు. దొంగల సోపతి బట్టి దొంగల బండి ఎక్కితే తగ్గేది మీ గౌరవమే.

 సీఎం రేవంత్‌రెడ్డి

నల్లగొండ, డిసెంబర్ 7 (విజయక్రాంతి) : ‘పదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నల్లగొండ జిల్లాకు అన్నిరంగాల్లో తీరని అన్యాయం జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల పూర్తిలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యహరించింది. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం’ అని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టంచేశారు.

జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగు నీటితోపాటు 500 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2008లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో చేపట్టిన ఎస్సెల్బీసీ ప్రాజెక్టుతోపాటు లక్ష ఎకరాలకు సాగునీరందిం చేలా రూపొందించిన బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టును సైతం పూర్తి చేయకుండా కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.

శనివారం నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు, దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్‌ప్లాంట్ రెండో యూనిట్‌లో విద్యుదుత్పత్తిని గ్రిడ్‌కు అనుసంధానం చేసిన అనంతరం నల్లగొండలోని గంధవారిగూడెంలో నిర్మించిన మెడికల్ కళాశాల భవనాన్ని  సీఎం ప్రారంభించారు.

అక్కడే రాజీవ్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలోకంటే కేసీఆర్ ప్రభుత్వంలోనే నల్లగొండ జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ఆక్షేపించారు. నల్లగొండలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని, కృష్ణానది నీటితో జిల్లాను సస్య శ్యామలంగా మారుస్తామన్నారు.

వరి వేసుకుంటే ఉరివేసుకున్నట్టేనని  కేసీఆర్ అన్నార ని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వరి రైతులను వెన్నుతట్టి ప్రోత్సహించిందని గుర్తుచేశారు. రైతులు సన్న ధాన్యం పండించాలని విజ్ఞప్తి చేశారు. నల్లగొండ జిల్లాలో 5.12 లక్షల ఎకరాల్లో రైతులు వరి పండించి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. వరి పండించిన రైతులు గుండెలపై చేయి వేసుకొని నిశ్చితంగా ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొన్నదని తెలిపారు. 

నాడు పంచ పాండువుల్లా పోరాటం..

బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కొని కాంగ్రెస్‌కు సీఎల్పీ హోదా లేకుండా చేశారని.. అయినా మొక్కవోని ధైర్యంతో ఐదుగురితో పంచపాండవుల్లా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పోరాటం చేశారని గుర్తుచేశారు. గెలిస్తే పాలిస్తాం.. ఓడితే ఫాంహౌస్‌లో పడుకుంటామన్న ధోరణి కేసీఆర్‌కు మంచిది కాదని పేర్కొన్నారు.

ఏడాది కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ ఏనాడూ అసెంబ్లీకి రాకపోవడం శోచనీయమన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ ఏనాడూ తన అనుభ వాన్ని ప్రజలకోసం వినియోగించారా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకపోతే ప్రశ్నించాల్సిన వ్యక్తి.. గాలిబ్యాచ్‌ను తయారుచేసి ప్రభుత్వంపై ఉసిగొలిపారని మండిపడ్డారు. తాను, వెంకట్‌రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయిన వారమేనని.. అయినా ప్రజాక్షేత్రాన్ని వీడకుండా ఎంపీలుగా గెలిచి తెలంగాణ గళాన్ని పార్లమెంటులో వినిపించామన్నారు. 

పోటీ పరీక్ష పెటొ1్టందంటారా?

నీళ్లు, నియామకాలు, నిధుల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని, అయితే పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని సీఎం అన్నారు.  గ్రూప్1, డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలు వద్దనడం యువతకు మంచిదా? అని నిలదీ శారు. మీ నలుగురు కుటుంబ సభ్యుల కోసం 1200 మంది త్యాగం చేశారా? లేక భవిష్యత్ తరాల కోసం త్యాగం చేశారా? కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.

ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 55,143 ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. బీజీపీ పాలిత రాష్ట్రాల్లో ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రాన్ని ప్రధాని మోదీ చూపితే నడిబజారులో తలదించుకొని క్షమాపణ చెప్తానని సవాలు విసిరారు.

జేపీ నడ్డా వాస్తవాలను తెలుసుకోకుండా తెలంగాణ గడ్డపై అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కేటీఆర్, హరీశ్‌రావు మాటలనే కిషన్‌రెడ్డి, ఈటెల కాపీ కొడుతున్నారని వ్యాఖ్యానించారు. దొంగల సోపతి బట్టి దొంగల బండి ఎక్కితే తగ్గేది మీ గౌరవమేనని హితవు పలికారు. 

రూ.21 వేల కోట్ల రుణమాఫీ 

రాష్ట్రంలోని 25 లక్షల 50 వేలమంది రైతులకు  ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని సీఎం అన్నా రు. ఏడాదిలో రుణమాఫీకి రూ.21 వేల కోట్లు విడుదల చేశామని స్పష్టంచేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2, 400 కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని, వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత తమదేనని పేర్కొన్నారు.

రైతుల కరెంట్ మోటార్ల విద్యుత్ బిల్లులను మాఫీ చేసింది వైఎస్‌ఆర్ అని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రూ.500కే గ్యాస్ సిలెండర్ ఇస్తున్నామని, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాయని తెలిపారు.

ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు,  పోలీసులకు విధుల్లో స్వేచ్ఛనిచ్చామని సీఎం పేర్కొన్నారు. సిసలైన ప్రజాపాలనపై బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో చేస్తున్న ద్రుష్పచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

హామీలను నెరవేరుస్తాం..

ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని సీఎం హామీ ఇచ్చారు. 16 లక్షల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని. పదేండ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం  రూ.7లక్షల కోట్లు అప్పు చేస్తే తొలి ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 66 వేల కోట్లు అప్పుల వడ్డీకే చెల్లించిందని తెలిపారు.  విద్యావంతులైన తెలంగాణ యువత, ఆర్థికవేత్తలు ఈ విషయం లోతుగా ఆలోచించాలని సీఎం సూచించారు. 

ఫోర్త్ సిటీ నిర్మిస్తాం

శంషాబాద్‌కు సమీపంలో 50 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీని కట్టి నిర్మించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేని సీఎం చెప్పారు. ఇందులో పరిశ్రమలతో తెలంగాణ యువతకు ఉద్యోగాలిచ్చేలా అనే పరిశ్రమలను నెలకొల్పుతామని హామీనిచ్చారు. ఎవరు అడ్డుకున్నా మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. మూసీ ప్రక్షాళనకు అడ్డొచ్చే వారిని ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

మూపీ ప్రక్షాళనకు అడ్డుపడితే ఎల్‌బీనగర్, మహేశ్వరం, ఉప్పల్, నల్లగొండ ప్రజలు ఏకమై బీఆర్‌ఎస్ నేతలను తరిమికొట్టాలన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేసి గోదావరి నీటిని అనుసంధానం చేస్తామన్నారు. మూసీ ప్రక్షాళన చేయాలో వద్దో.. అనుభవం కలిగిన కేసీఆర్ చెబితే బాగుంటుం దన్నారు.

ప్రక్షాళన చేయాలో.. వద్దో పక్కనున్న ఏకలింగాన్ని అడగాలని, వద్దంటే ఆ లింగాన్ని మూసీలో ముంచాలని పరోక్షంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిని విమర్శించారు.    

సంక్రాంతి తరువాత రైతు భరోసా

ఎవరెన్ని చెప్పినా రైతులు వినొద్దని సంక్రాంతి తరువాత రైతు భరోసా ఖాతాల్లో వేస్తామని ముఖ్యమంత్రి సభా వేదికగా హామీ ఇచ్చారు. రైతుబంధు వేస్తే ఇక బీఆర్‌ఎస్ నేతల గుండెలు గుబేలేనని వ్యాఖ్యానించారు. రైతులు సన్నధాన్యమే పండించాలని ఆ ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని హామీ ఇచ్చారు. త్వరలో రేషన్‌దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. 

పవర్ ప్లాంట్‌ను గాలికొదిలేశారు..

డిప్యూటీ సీఎం మల్లు భట్టి

యాదాద్రి పవర్ ప్లాంట్‌ను గత ప్రభుత్వం మొదలుపెట్టి గాలికొదిలేసింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు పనులు మొదటికొచ్చాయి. గ్రీన్ ట్రిబ్యునల్  పర్యావరణ అనుమతులు రద్దు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024 ఫిబ్రవరిలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి పనులను వేగవంతం చేశాం.

ఏడాదిలోనే రెండు యూనిట్లు పూర్తి చేసి 800 యూనిట్లను గ్రిడ్‌కు అనుసంధానం చేశాం. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు ప్రారంభంతోపాటు పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ఎస్సెల్బీసీ సొరంగాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తాం. సాగునీటి ప్రాజెక్టులను కృష్ణానీటితో నింపి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం.

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రతి నియోజకవర్గంలో రూ.5 వేలకోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఆరునెలల్లోనే ఇదంతా చేశాం. రాష్ట్రంలో అన్నిరంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. యావత్ తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది.  రానున్న నాలుగేండ్లలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.

సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం..

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

రాష్ట్రంలోని సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాం. 9 కిలోమీటర్ల మేర పెండింగ్‌లో ఉన్న ఎస్సెల్బీసీ సొరంగ మార్గం పూర్తి చేయడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపింది. రెండేళ్లలో దీన్ని పూర్తి చేస్తాం. ఇవాళ సీఎం ప్రారంభించిన బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు ద్వారా నాలుగు నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది.

బూనిదిగాని కాల్వ, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలను పునరుద్ధరిస్తాం. సాగర్ ఎడమక కాల్వ పరిధిలోని లిఫ్టులకు మరమ్మతులు చేసి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందేలా చూస్తాం. డిండి ప్రాజెక్టు పరిధిలోని నక్కలగండి, నెల్లికల్ లిఫ్ట్‌లను రెండు దశల్లో పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఈ వానకాలం రాష్ట్రంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. ఇది దేశ చరిత్రలోనే రికార్డు. ప్రతి గ్రామానికి రహదారులు నిర్మిస్తాం. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఈ ఘనత కార్యకర్తలదే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏడుసార్లు గెలిచిన నేతగా మాటిస్తున్నా ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటా.

విధ్వంసమైన తెలంగాణ వికాసం వైపు..

రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  

పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో విధ్వంసమైన తెలంగాణను ఏడాది కాంగ్రెస్ పాలనలో వికాసం వైపు నడిపాం. ప్రజాపాలన విజయోత్సవ ముగింపు సభను నల్లగొండలో నిర్వహించడం ఆనందంగా ఉంది. ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తాం. రెండేళ్లలో ఎస్సెల్బీసీ పనులు పూర్తి చేస్తాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది.

కేసీఆర్ పరిపాలనలో నల్లగొండ జిల్లా అధోగతి పాలైంది. అందుకే ప్రజలు ఇక్కడ బీఆర్‌ఎస్‌ను చిత్తుగా ఓడించారు. తిప్పర్తి, కనగల్ మండలాలకు జూనియర్ కళాశాలల మంజూరు చేస్తాం. శివన్నగూడెం, బస్వాపురం, గంధమళ్ల ప్రాజెక్టులను పూర్తి చేసి 8 నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

మూసీ ప్రక్షాళనకు నడుం బిగించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. నల్లగొండ పోరాటాల గడ్డ.. ఈ గడ్డను బంగారు కొండగా మార్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ది ఒడిసిన ముచ్చట. 30 మంది ఎమ్మెల్యేలుండి ప్రతిపక్షనేత కేసీఆర్ ఫాంహౌస్‌కు పరిమితయ్యారు.