08-12-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్/నిర్మల్/బెజ్జూర్/, డిసెంబర్ 7 (విజయక్రాంతి): 2వ సాధారణ పం చాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఎన్నికలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు.
ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి మొదటి విడత పోలింగ్ నిర్వహించే లింగాపూర్, సిర్పూర్-యు, జైనూర్, కెరమెరి, వాంకిడి మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, జోనల్ అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత లో భాగంగా ఈ నెల 11వ తేదీన నిర్వహించే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికలలో ఉపయోగించే సామాగ్రి, కవర్లు, పేపర్లు అన్ని అందుబాటులో ఉండేలా చూసుకోవాల ని తెలిపారు. బ్యాలెట్ పత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, సామాగ్రి పంపిణీ కేంద్రం వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసి రద్దీ లేకుండా చూసుకోవాలని తెలిపారు.
సందేహాల నివృత్తి కొరకు పంపిణీ కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, పోలింగ్ సిబ్బందికి త్రాగునీరు, అల్పాహారం, భోజనం సమయానికి అందించాలని, జోనల్ అధికారులు తమ రూట్ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించాలని తెలిపారు. పూర్తి బందోబస్తు మధ్య ఎన్నికల నిర్వహణ, కౌం టింగ్ ప్రక్రియను ప్రశాంతంగా చేపట్టేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలి పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తాం
నిర్మల్ జిల్లాలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహిస్తామని జిల్లా ప్రత్యేక పరిశీలకురాలు ఆయేషా ముసారఫ్ ఖాన్ అన్నారు. ఆదివారం జిల్లాలోని లక్ష్మణ్ చందా మామడ ఖానాపూర్ మండలంలో పర్యటించి పోలింగ్ బాక్సులు పోలింగ్ కేంద్రాల పరిశీలించారు. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు సిబ్బంది ఉన్నారు.
ఎన్నికల శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి
రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయడం లక్ష్యంగా కౌటాల పోలీస్ స్టేషన్ సీఐ సంతోష్ సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలు అందుబాటులో ఉన్న పోలీసు బలగాలతో కలిసి బెజ్జూర్, కుకుడ గ్రామాల్లో విస్తృతంగా ఫ్లాగ్ మార్చ్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహించినట్లు తెలిపారు.
సీఐ సంతోష్ మాట్లాడుతూ ఎన్నికల శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అవసరమైతే అదనపు బందోబస్తు మోహరింపుకు విభాగం పూర్తిగా సిద్ధంగా ఉందని, ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకునేందుకు అన్ని పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సర్తాజ్ పాషా, చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
వేలం పాట ద్వారా ఎన్నికలు నేరం
ఆదిలాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): గ్రామ పంచాయితీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆదివారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పలు క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉన్నటువంటి గ్రామాలైన చాందా (టి), జందాపూర్, కప్పర్ల గ్రామాలను సందర్శించిన జిల్లా ఎస్పీ ప్రజలకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎవరి బలవంతం ఓటు పై ఉండకూడదని, ఎన్నికలను వేలం పాట ద్వారా నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని, వీడీసీల జోక్యం ఎన్నికలలో ఉండకూడదని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పూర్తి చేయాలని తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులను పెట్టిన వారిపై పోలీసు చర్యలు తప్పమన్నారు.
మూడు గ్రామాలైన చాందా టి, జందాపూర్ , కప్పర్ల గ్రామాలలో ప్రత్యేకంగా స్పెషల్ పార్టీ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలలో పోలీసుల పట్ల విశ్వాసం, నమ్మకం పెంపొందించడం జరిగిందనీ, పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్లు, 200 మీటర్ల వద్ద సూచించబడిన నియమాలను పాటించాలని తెలిపారు. ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు.
టపాకాయలను వెలిగించకూడదని తెలిపారు. ఎన్నికల సభలకు, సమావేశాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలా బాద్ డిఎస్పి జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ రూరల్ సిఐ ఫణిదర్, ఎస్సైలు వి విష్ణువర్ధన్, డి రాధిక, జీవన్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.
అభివృద్ధిని చూపి ఓటు అడగాలి
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం ఆలోచిస్తున్న సంక్షేమ పథకాల ను ప్రజలకు వివరించి కాంగ్రెస్ మద్దతుదారులను సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించుకో వాలని మాజీ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు అన్నారు.
మామడ మండలంలోని కప్పనపల్లి దిమ్మదుర్తి తదితర గ్రామాల్లో పర్యటించి ఈనెల 11న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపిం చుకోవాలని కార్యకర్తలకు, పార్టీ నేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.