ప్రధాని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
యాదాద్రి భువనగిరి, మే 28 (విజయక్రాంతి): ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారా ల్లో ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్య లు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్ వీరయ్య విమర్శించారు. మంగళవారం భువనగిరిలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజమైన చరిత్రను కనుమరుగు చేసి తప్పుడు చరిత్రలను దేశ ప్రజలపై రుద్దుతున్నారని ఆరోపించారు. దేశ ప్రధాని మతోన్మాదాన్ని ప్రేరేపించే విధంగా ఉపన్యాసాలు చేసి ప్రజలను రెచ్చగొట్టడం ఏంటని ప్రశ్నించారు.
కార్మిక చట్టాలను కాలరాయడం, రైతుల పొట్టకొట్టే నల్ల చట్టాలను తీసుకురావడం, నిరుద్యో గం, పేదరికాన్ని, ధరలను అదుపు చేయకపోవడం బీజేపీ పాలనలోనే సాధ్యమైందని ఎద్దేవా చేశారు. అనంతరం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై గ్రామీణ స్థాయి పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, నాయకులు కొండమండుగు నర్సింహ, మంగ నర్సింహులు, మాటూరి బాలరాజు, దేనూరి నర్సిరెడ్డి, దాసరి పాండు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.






