24 April, 2026 | 12:01 AM

బండి సంజయ్ ఓటమి ఖాయం

12-05-2024 12:30 AM

కరీంనగర్‌లో గెలుపు బీఆర్‌ఎస్‌దే..

ఆంధ్రాలో టీడీపీ గెలిస్తే బాబుతో రేవంత్ ములాఖత్

హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేసేందుకు కుట్ర

బోయినపల్లి వినోద్‌కుమార్ 

కరీంనగర్, మే 11 (విజయక్రాంతి): కరీంనగర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఓటమి ఖాయమని, ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టిన బీఆర్‌ఎస్‌నే గెలిపిస్తారని పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ జోస్యం చెప్పారు. కరీంనగర్‌లోని ఓ హోటల్‌లో శనివారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎంపీగా బండి సంజయ్ ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని, కానీ ప్రచార చిత్రాల్లో మాత్రం దర్జాగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీని ఎంపీగా బండి సంజయ్ సమావేశాల్లో మాత్రమే కలిశారని, ఏనాడూ అభివృద్ధిపై వ్యక్తిగతంగా కలిసి వినతి అందించలేదన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలి పార్టీ కార్యకలాపాల్లో బండి సంజయ్ బిజీగా ఉంటారన్నారు. ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌కు అనూహ్యమైన స్పందన వచ్చిందన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం తాను గతంలో అనేకసార్లు కేంద్ర మంత్రులను కలిశానని గుర్తుచేశారు.

ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామీణ వ్యవస్థ విధ్వంసమైందని, ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ సాగునీటి సమస్య తలెత్తిందన్నారు. కరెంట్ కోతలు, మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం మొదలైందన్నారు. ప్రజలజు మళ్లీ కేసీఆర్ రావాలనే ఆకాంక్ష మొదలయిందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే పైచేయి అవుతుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిస్తే చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి కలిసి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేసే అవకాశం ఉందన్నారు. ఎన్నికల ప్రచారానికి వేములవాడ వచ్చిన ప్రధాని మోదీ రాజన్న ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే గంగుల, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, మేయర్ సునీల్‌రావు, పాల్గొన్నారు.