17-07-2025 12:01:09 AM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎఫ్ఏసి, కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కాంపల్లి శంకర్ బుధవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కామర్స్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి లో గల తెలంగాణ విశ్వవిద్యాలయం నిర్వహించిన రెండవ కాన్వకేషన్ కార్యక్రమంలో ఆయన ఈ ఘనత సాధించారు. 2006లో తెలంగాణ విశ్వవిద్యాలయంలో మొట్టమొదటి బ్యాచ్ లో ఎంకామ్ ఈ కామర్స్ చదివి పీజీ పట్టా అందుకున్నారు. పీహెచ్డీ రెండవ బ్యాచ్ లో కామర్స్ విభాగంలో మొట్టమొదటి ర్యాంక్ సాధించి పరిశోధన ప్రారంభించారు.
నిర్ణీత కాలంలో పరిశోధన పూర్తి చేసి కామర్స్ విభాగం నుంచి డాక్టరేట్ పొందారు. దీనికి సంబంధించి కాన్వకేషన్ పట్టాను బుధవారం గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు.విద్యార్థి స్థాయి నుంచే అంచెలంచెలుగా ఎదిగి. బెల్లంపల్లి ప్రాంతంలో కాంపల్లి శంకర్ డాక్టరేట్ పట్టా సాధించారు. దీని వెనక ఆయన మానవత్వం.. సేవాతత్వం.. విద్యాతత్వం దాగి ఉన్నది. అత్యున్నత డిగ్రీ వరకు బెల్లంపల్లిలోనే చదివిన ఆయన పీజీ, పీహెచ్డీ తెలంగాణ విశ్వవిద్యాలయంలో అభ్యసించారు.
ఇవేకాక బీఈడీ, బీపీఈడీ, ఎంఏ ఇంగ్లీష్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా జ్యోతిర్ వాస్తు వంటి కోర్సులు కూడా చదివారు. ఇప్పుడు తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి కామర్స్ డాక్టరేట్ పట్టాను సాక్షాత్తు గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు. కాగా, 2008లో ఉట్నూరులో డిగ్రీ లెక్చరర్ గా ఉద్యోగపర్వం ప్రారంభించి 2013 నుంచి చెన్నూరులో, 2018 నుంచి బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకునిగా కొనసాగుతూ 2023లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయి 2024 ఆగస్టులో ప్రిన్సిపాల్ ఎఫెఏసీ అయ్యారు.
సరికొత్త అంశంపై పరిశోధనకు పట్టం
తెలంగాణ విశ్వవిద్యాలయంలో కామర్స్ పీహెచ్డీ సెలక్షన్ పరీక్షల్లో యూనివర్సిటీ మొదటి ర్యాంకు సాధించి... పేద ప్రజల ఆర్థిక అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన 'ముద్ర' అనే విషయంపై కామర్స్ లో "పర్ఫామెన్స్ ఎనాలసిస్ ఆఫ్ ముద్ర.. ఏ స్టడీ ఆన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఎంఎస్ ఎంఇస్" అనే పరిశోధన పూర్తిచేసి ప్రొఫెసర్ మాదారపు యాదగిరి పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రొఫెసర్ గోపిశెట్టి రాంబాబు సహాయ సహకారాలు ఆయనకు అందించారు.
డాక్టర్ కాంపల్లి శంకర్ ప్రస్తుతం తాను డిగ్రీ చదువుకున్న బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకే ఫుల్ అడిషనల్ చార్జెస్ ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు. ఇక విద్యా రంగంలో నిత్యం తలమునకలై ఉంటూనే వ్యక్తిగత ప్రగతి సాధించి డాక్టరేట్ పట్టాను గవర్నర్ చేతుల మీదుగా డాక్టర్ కాంపల్లి శంకర్ అందుకోవడం పట్ల బంధు మిత్రులు కళాశాల సహ ఉద్యోగులు, వర్సిటీ ప్రొఫెసర్లు హర్షం వ్యక్తం చేసి అభినందించారు.