5 April, 2026 | 4:30 AM

భక్తి విశ్వాసాలకు పెద్దపీటవేస్తూ.. బాసర అభివృద్ధి

05-04-2026 12:44 AM

ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు

జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధ్దిపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహాలో నిబంధనలు అమలుచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాజకీయ పార్టీల సభలు, జెండాలు, ప్రదర్శనలు లేకుండా ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయాలని ఆయన సూచించారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ అభివృద్ధి పనులపై సీఎం శనివారం సమీక్ష నిర్వహించారు.

తొలుత బాసర ఆలయ అభివృద్ధికి సంబంధిచిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రేవంత్‌రెడ్డికి వివరించారు. ఆల య అభివృద్ధి పనులకు రూ.225 కోట్లు వ్య యమవుతుందని అధికారులు తెలియజేశారు. మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించిన సీఎం పలు మార్పులు సూచించారు. సంప్రదాయాలు, శాస్త్రాలను పరిగణనలోకి తీసుకొని భక్తుల విశ్వాసాలకు పెద్దపీట వేస్తూ బాసర ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం చెప్పారు.

భవిష్యత్ అవసరాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు నిర్మించాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణం భవిష్యత్‌లో భారీ వృక్షాలతో అలరారేలా అవసరమైన మొక్కలు నాటాలని సూచించారు. ఆలయం సమీపంలో హెల్త్ సెంటర్ నిర్మించాలని.. పుష్కరాలు, ఇతర ఉత్సవాల రోజుల్లో అక్కడ తగిన సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి, భక్తులకు సేవలు అందించేందుకు అనువుగా దానిని నిర్మించాలని చెప్పారు.

ఎంతటి ప్రముఖుల వాహనాలైనా ఆలయ ప్రాంగణానికి బయటే నిలిచిపోవాలని.. ఆలయ ప్రాం గణంలోకి కేవలం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ద్వారానే చేరుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వాహనాల పార్కింగ్ ప్రదేశంలో సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలన్నారు.

అభివృద్ధి పనుల సమయంలో ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్త పడాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీపడితే ఏమాత్రం సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 

ఈ సమీక్షలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామ య్యర్, కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.