20-12-2025 01:43:37 AM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్, డిసెంబర్ 19 : పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం తెలిపారు. శుక్రవారం నాడు నకిరేకల్ మున్సిపాలిటీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పట్టణ పరిశుభ్రతలో పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యమని పేర్కొన్నారు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
కార్మికులు తమ ఆరోగ్యంపై నిరంతరం శ్రద్ధ వహించాలని, ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. వైద్య శిబిరం ద్వారా పారిశుధ్య కార్మికులకు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజితశ్రీనివాస్, పిఎసియస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ కమిషనర్ రంజిత్ కుమార్, స్థానిక కౌన్సిలర్లు గాజుల సుకన్య ,నాయకులు మురారి శెట్టి కృష్ణమూర్తి, యాసారపు వెంకన్న, మట్టిపల్లి వీరు ,పన్నాల శ్రీనివాస్ రెడ్డి ,ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.