20-12-2025 01:42:14 AM
నకిరేకల్, డిసెంబర్ 19 (విజయ క్రాంతి): డిసెంబర్ 23న జరగనున్న జాతీయ రైతు దినోత్సవం విజయవంతం చేయాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి శుక్రవారం నకిరేకల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహాత్మాగాంధీ సూచించిన విజ్ఞానాన్ని సత్యం, అహింసా మార్గంలో ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు సుఖశాంతితో, సుస్థిర అభివృద్ధి సాధించేందుకు గత 50 సంవత్సరాలుగా నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.
గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ స్వర్ణోత్సవాల సందర్భంలో గాంధీజీ ఒక అడుగు ఎత్తిన లక్ష విగ్రహాలను రాష్ట్రమంతా సేకరించే కార్యక్రమం చేపట్టి, నకిరేకల్ నియోజకవర్గంలో 1200 విగ్రహాలను సేకరణ లక్ష్యంగా పెట్టామన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రతి జిల్లా నుండి ఒకరి చొప్పున ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తున్న ఉత్తమ రైతు దంపతులకు పుడమిపుత్ర అవార్డులు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో విశిష్ట కృషి చేసిన అగ్రి జర్నలిస్టులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, అధికారులు కిసాన్ సేవా రత్న అవార్డులు అందిస్తామన్నారు.
వ్యవసాయ విధానం స్వదేశీగా ఉంటే భూమి ఆరోగ్యంగా, పంటలు పౌష్టికంగా, ప్రజలు, జీవకోటి ఆరోగ్యంగా ఉంటారని, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి పరిరక్షణలో రైతులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవార్డుల పంపిణీతో పాటు గోపూజ, 1156 గాంధీజీ విగ్రహాల సామూహిక ప్రదర్శన, 156 చరకాల ప్రదర్శన, 156 మందితో బాల గాంధీ వేషధారణ, ఎద్దు గానుగ ప్రదర్శన, గ్రామ నిర్మాతల వృత్తులు మరియు ఉత్పత్తుల ప్రదర్శన, పురాతన, ఆధునిక వ్యవసాయ పనిముట్ల ప్రదర్శన, మల్కంబు, యోగా, విద్యార్థుల ప్రతిభా పాటలు, పోటీలు నిర్వహిస్తామన్నారు.
గాంధీజీ సుస్థిర విజ్ఞానం, సుస్థిర విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమలు, సహజ వనరులు, పర్యావరణం, మత్తుపదార్థాల నిషేధం, స్వదేశీ క్రీడలపై ప్రదర్శనలు, ప్రముఖుల సందేశాలు కూడా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి, రైతు విభాగంపడమటిపావని, పెన్షనర్స్ అధ్యక్షులు కందాల పాపిరెడ్డి,
ప్రధాన కార్యదర్శి వీరమల్ల రవీందర్, ఉపాధ్యక్షులు ఆంజనేయులు గుప్తా, ట్రస్మ అధ్యక్షులు ఎర్ర శంభు లింగారెడ్డి, మారపాక నరసయ్య, యానాల వెంకటరెడ్డి, టిఆర్‌ఎస్‌ఎం జిల్లా కోశాధికారి మట్ట చెన్నయ్య గౌడ్, జటావత్ జవహర్లాల్ నాయక్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రతినిధులు నీరుడు దయాకర్ రెడ్డి, పి. హరి దీప్ రెడ్డి, పల్లె శ్రీనివాస్ గౌడ్, పవన్, కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ పుచ్చకాయల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.