20-12-2025 01:44:02 AM
ఈఎస్‌ఐలో స్వీపర్లు, అటెండర్లతోనే సరి..
హైదరాబాద్, డిసెంబర్ 1౯ (విజయక్రాంతి) : ఫార్మాసిస్ట్.. అసుపత్రుల్లో వైద్యు లు రాసే మందులను చీటీని చూసి.. మందులను, సూదులను అందించే కీలకమైన ఉద్యోగి. అయితే ఫార్మాసిస్ట్ స్థానంలో అటెండర్, స్వీపర్ పనిచేస్తూ రోగులకు మందు లను ఇస్తుంటే ఏమవుతుంది..? ఎప్పుడో ఒకప్పుడు ఒక డ్రగ్‌కు బదులుగా ఇంకో డ్రగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది.. దీనితో రోగి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో నడిచే చాలా డిస్పెన్సరీల్లో ఫార్మాసిస్ట్‌లు లేరు. అక్కడ అందుబాటులోఉన్న స్వీపర్లు, అటెంటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో ఫార్మాసిస్ట్ చేసే పనులను చేయిస్తుండగా.. స్టాఫ్ నర్స్‌లు, ఏఎన్‌ఎంలను కూడా వినియోగిస్తున్నారు.
కోటి మందికి అవే దిక్కు..
రాష్ట్రవ్యాప్తంగా ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో మొత్తం 70 వరకు డిస్పెన్సరీలు ఉన్నాయి. హైదరాబాద్ జేడీ పరిధిలో 53 డిస్పెన్సరీ లు, వరంగల్ జేడీ పరిధిలో మరో 17 డిస్పెన్సరీలు పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో సుమా రు 20 లక్షల మంది (వారి కుటుంబ సభ్యులతో కలుపుకుంటే.. సుమారు కోటి మంది) ఈఎస్‌ఐ లబ్ధిదారులకు ప్రాథమికంగా ఈ డిస్పెన్సరీలే దిక్కు. మొదట డిస్పెన్సరీలలో ప్రాథమిక పరీక్షల అనంతరం వ్యాధిని బట్టి.. స్పెషలిస్ట్‌లు ఉండే నాచారంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రికి గానీ.. లేదా ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐసీ ఆసుపత్రికిగానీ రిఫర్ చేస్తుంటారు.
అటెండర్లు.. స్వీపర్లే..
ఒకరు తక్కువగా ఉంటే ఫరవాలేదు.. కానీ ఒక్కరుకూడా లేకపోతే ఎలా.. డిస్పెన్సరీలు ఎలా నడుస్తున్నాయి.. రోగులకు ఎలా.. ఎవరు మందులు ఇస్తున్నారనే అనుమానం కలుగుతుంది కదా.. దీనికి తాత్కాలికంగా ఒక ఆలోచన చేశారు.. దానినే అమలు చేస్తున్నారు. ఒకచోట సీపర్.. మరోచోట అటెండర్.. ఇంకోచోట డేటా ఎంట్రీ ఆపరేటర్.. ఫార్మాసిస్ట్‌గా అవతారం ఎత్తి.. రోగులకు మందులు ఇస్తున్నారు.
స్టోర్‌కు వచ్చే మందుల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. కొండొకచో.. ఏఎన్‌ఎంలు, స్టాఫ్ నర్స్‌లతో.. ఫార్మాసిస్ట్‌ల పనులను చేయిస్తున్నారు. దీనితో ఎప్పుడేం జరుగుతుందోననే భయం.. సిబ్బందిలో కనపడుతోంది. అయితే ఇవేమీ తెలియని రోగులు మాత్రం.. మందులు ఇచ్చారనే సంతోషంతో వెళుతున్నారు.. మందులు ఇచ్చేవారందరూ.. ఫార్మాసిస్ట్‌లే అనే నమ్మకంతో రోగులు మందులు తీసుకుని వెనుతిరుగుతున్నారు.
ఒక్క ఫార్మాసిస్ట్‌కూడా లేని డిస్పెన్సరీలు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే.. శంషాబాద్‌లోని ఈఎస్‌ఐ డిస్పె న్సరీ.. అలాగే కార్మికులతో కళకళలాడే పటాన్‌చెరు.. ఇంకా జహీరాబాద్.. ఇస్నాపూర్.. ఇలా అనేక డిస్పెన్సరీల్లో ఫార్మాసిస్ట్‌లు లేకపోవడంతో ఇతర సిబ్బందితో.. కొన్నిసార్లు కాంట్రా క్టు ఉద్యోగులే ఫార్మాసిస్ట్ అవతారం ఎత్తుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 70 వరకు డిస్పెన్సరీలు ఉంటే.. ఇందులో 70 శాతం వరకు ఫార్మాసిస్ట్‌లు లేరు. గడిచిన 12 ఏండ్లుగా రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో.. చాలా మంది రిటైర్డ్ అయ్యారు. ఉన్నవారుకూడా రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్నారు.
నోటిఫికేషన్ ఇచ్చారు.. భర్తీ మరిచారు..
ఇదిలాఉండగా.. ఈ విషయాన్ని అనేక దఫాలుగా ఈఎస్‌ఐ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంతో.. ఎట్టకేలకు 25 సెప్టెంబర్ 2024న సుమారు 600 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇస్తూ ఉత్తుర్వులు జారీచేసింది. దీని ప్రకారం తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ద్వారా భర్తీ ప్రక్రియను చేపట్టా రు. కానీ గడిచిన 15 నెలలుగా దానిని పూర్తి చేయడంపై దృష్టి సారించడం లేదు.
పేరుకే 10 విభాగాలకు చెందిన 600 పోస్టుల భర్తీకి క్లియరెన్స్ వచ్చినా.. కేవలం 99 పోస్టులు ఫార్మాసిస్ట్ గ్రేడ్-2తోపాటు 272 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఫలితాలను మాత్రం విడుదల చేయలేదు. దీనితో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఫార్మాసిస్ట్‌ల కొర త తీరుతుందని.. గడిచిన 15 నెలలుగా ఎదురుచూస్తున్నా.. ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న సంకేతాలు రావడం లేదు. దీనితో పేరుకే నోటిఫికేషన్ ఇచ్చారుగానీ.. భర్తీ మరిచారనే ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి.
2013 తరువాత కనపడని రిక్రూట్‌మెంట్..
ఎర్రగడ్డ, నాచారం ఆసుపత్రులను పక్కనపెడితే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 70 వరకు డిస్పెన్సరీల్లో మాత్రం ఫార్మాసిస్ట్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీనికి ప్రధాన కారణం.. 2013 తరువాత ఇప్పటి వరకు ఫార్మాసిస్ట్‌లను భర్తీ చేయకపోవడమే. వాస్తవానికి ఒక్కో డిస్పెన్సరీని పరిశీలిస్తే.. స్టోర్‌ను చూసుకోవడానికి ఒక ఫార్మాసిస్ట్.. అలాగే ఓపీ (ఔట్ పేషెంట్) విభాగంలో పనిచేయడానికి ఇద్దరు ఫార్మాసిస్ట్‌లు అవసరం. అంటే ఒక్కో డిస్పెన్సరీలో మొత్తం ముగ్గురు ఫార్మాసిస్ట్‌ల సేవలు అవసరం ఉంటాయి.
కొన్సిసార్లు.. ఒకరు తక్కువున్నా ఎలాగోలా సర్దుకోవచ్చు. కానీ ఒక్క ఫార్మాసిస్ట్ లేకపోతే ఎలా.. అనే సమస్య ఇప్పుడు డిస్పెన్సరీలను పట్టిపీడిస్తోంది. 2013లో ఒకసారి ఫార్మాసిస్ట్‌లను భర్తీ చేశారు. ఇప్పటివరకు అటువేపు చూడలేదు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే.. 2027 నాటికి మొత్తం మంది ఫార్మాసిస్ట్‌లు రిటైర్డ్ అయ్యే పరిస్థితి నెలకొందని ఈఎస్‌ఐ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు.