5 March, 2026 | 2:44 AM

దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యం

05-03-2026 01:15 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, మార్చి 4(విజయక్రాంతి): దివ్యాంగులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డెవిడ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో మహిళా, శిశు మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల హక్కుల కమిటీ సభ్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం అవసరమైన సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

చేయూత పింఛన్ పంపిణీ కేంద్రాల వద్ద త్రాగునీరు, నీడ, ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సదరం శిబిరాల వద్ద వీల్చైర్లు, హెల్పర్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలలో రిజర్వేషన్ ప్రకారం అర్హులైన దివ్యాంగులకు ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దివ్యాంగుల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి మండలంలో సమావేశాలు నిర్వహించి సమస్యలను గుర్తించి పరిష్కరించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి దత్తారావు, విద్య, వైద్య, సంక్షేమ శాఖల అధికారులు, దివ్యాంగుల హక్కుల సమితి సభ్యులు ఇస్లాం బిన్ అహ్మద్, వెంకటేశ్, రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు.