19 May, 2026 | 5:20 AM

జనగణన 2027లో ఖచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి

19-05-2026 12:00 AM

నమోదు ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి

హనుమకొండ, మే 18 (విజయక్రాంతి): జనగణన 2027 ప్రక్రియ ను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించాల ని రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోలికెరీ సూచించారు. సోమవా రం హనుమకొండ కలెక్టర్  చాహాత్ బాజ్పాయితో కలిసి హనుమకొండలోని ఎక్సైజ్ కాలనీ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న హౌస్ లిస్టింగ్, డిజిటల్ మ్యాపింగ్, గృహాల నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ఇంటింటికి వెళ్లి సేకరిస్తున్న వివరాలను సమీక్షించారు. కుటుంబ సభ్యుల వివరాలు, నివాస గృహాల సమాచారం, ప్రాంతాల వారీ నమోదు విధానం, డిజిటల్ పరికరాల వినియోగం తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏ ప్రాంతానికి చెందిన సమాచారం ఆ ప్రాంతానికి సంబం ధించిన కుటుంబాల ఆధారంగా ఖచ్చితంగా నమోదు కావాలని పేర్కొన్నారు. జనగణనలో నమోదు చేసే ప్రతి సమాచారం దేశ ప్రణాళికా రూపకల్పనకు కీలకమని  తెలిపారు. అందువల్ల వివరాల నమోదు సమయంలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ పూర్తి సమాచారం సేకరించాలని ఎన్యూమరేటర్లకు సూచించారు.  హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్పాయి మాట్లాడుతూ జిల్లాలో జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. సిబ్బందికి క్షేత్రస్థాయిలో శిక్షణ అందిస్తూ డిజిటల్ మ్యాపింగ్, గృహాల నమోదు ప్రక్రియను పారదర్శకంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఓ సత్యనారాయణ రెడ్డి, హనుమకొండ ఎమ్మార్వో రవీందర్ రెడ్డి, మున్సిపల్ అధికారులు బిర్రు శ్రీను, జనగణన విభాగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.