19 May, 2026 | 6:24 AM

జర్నలిస్టుల ప్లాట్లు అమ్మొద్దు.. కొనొద్దు!

19-05-2026 12:00 AM

కాలనీలో భూకబ్జాదారులకు రెవెన్యూ వార్నింగ్

అక్రమ లావాదేవీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

కుషాయిగూడ, మే 18: (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని దమ్మాయిగూడలో జర్నలిస్టులకు ప్రభుత్వం కేటాయించిన ప్లాట్ల విషయంలో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. సర్వే నంబర్ 538లో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల కాలనీలో ఎవరూ ప్లాట్లను అమ్మరాదని, కొనుగోలు చేయరాదని స్పష్టం చేస్తూ కాలనీ పరిధిలో పలు చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

అక్రమ లావాదేవీలు, భూకబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారంతో అధికారులు ఈ చర్యలకు దిగినట్లు తెలిసింది. కీసర తహసీల్దార్ పి. యాదగిరి రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో సిబ్బంది కాలనీలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం జర్నలిస్టులకు కేటాయించిన పట్టా భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకాలు, కొనుగోళ్లు చేయరాదు అని పేర్కొంటూ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి రిజిస్ట్రేషన్లు, ఒప్పందాలు, దళారి వ్యవహారాలు నిర్వహించినా చట్టపరమై న చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇటీవల కొంతమంది భూకబ్జాదారులు కాలనీలోని ఖాళీ ప్లాట్లపై కన్నేసి నకిలీ పత్రాలు సృష్టించి విక్రయాలకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అమా యకులను మోసం చేసి ప్లాట్లు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జర్నలిస్టుల హక్కులను పరిరక్షించడంతో పాటు ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికారులు కఠిన వైఖరి అవలంబిస్తున్నారు.

కాలనీలో ఎవరైనా అనుమానాస్పదంగా భూముల కొనుగోలు, అమ్మకాల వ్యవహారాల్లో పాల్గొంటే వెంటనే రెవెన్యూ శాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. జర్నలిస్టులకు కేటాయించిన భూము లపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు జరిగినా వాటిని తొలగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షే మం కోసం కేటాయించిన భూములను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అధికా రులు పేర్కొన్నారు. కాలనీలో భద్రతా చర్యలు మరింత పెంచడంతో పాటు తరచూ పర్యవేక్షణ చేపట్టాలని స్థానిక జర్నలిస్టులు, కాలనీ వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.