20 June, 2026 | 3:27 AM

వాస్తవ నిర్ధారణకు ప్రాధాన్యమివ్వాలి

20-06-2026 01:48 AM

మహబూబ్నగర్ అర్బన్ జూన్,19: ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో విలేకరులు క్రియాశీలక పాత్ర పోషించాలని మహబూబ్నగర్ జిల్లా  పౌర సంబంధాల  అధికారి  పి. శ్రీనివాస్ అన్నారు. “12 ఏళ్ల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం’ పేరిట దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) హైదరాబాద్ విభాగం శుక్రవారం మహబూబ్నగర్లో ప్రత్యేక వార్తాలాప్ మీడియా వర్కుషాపును నిర్వహించింది.

ఈ వర్కుషాపును డి.పి ఆర్.ఓ  శ్రీనివాస్ ప్రారంభించి మాట్లాడారు. కృత్రిమ మేధ, డిజిటల్ సమాచార యుగంలో వాస్తవ నిర్ధారణ, బాధ్యతాయుతమైన పాత్రికేయానికి ఉన్న ప్రాధాన్యం గురించి వివరిస్తూ, ప్రచురణకు ముందే సమాచారాన్ని సరిచూసుకోవాలని, నైతిక విలువలతో కూడిన రిపోర్టింగు ద్వారా సమాజంలో అవగాహన పెంపొందించడానికి తోడ్పడాలని విలేకరులను కోరారు. పి ఐ.బి హైదరాబాద్ విభాగం మీడియా, కమ్యూనికేషన్ అధికారి వర్గంటి గాయత్రి మాట్లాడుతూ వార్తాలాప్ కార్యక్రమ విశిష్టత గురించి వివరించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు అందించడంలోని ప్రాధాన్యాన్ని ఆమె తెలియజేశారు. విశ్వసనీయ, పారదర్శక సమాచారాన్ని అందించడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలకూ, ప్రజలకూ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంలో పీఐబీ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై ఈ వర్కుషాపులో ప్రముఖ పాత్రికేయులు శ్రీముద్దం నరసింహస్వామి ప్రజెంటేషన్ ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, పాలన సంస్కరణలపై ఆయన పాత్రికేయులకు సమగ్ర అవగాహనను అందించారు. ఫ్యాక్ట్ చెక్ శిక్షకురాలు శ్రీమతి బీఎన్ సత్యప్రియ అవగాహన కల్పించారు. విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారాన్ని ధ్రువీకరించుకోవడం, అసత్య కథనాలను గుర్తించడం, బాధ్యతాయుతమైన వార్తా నివేదనకు ఉత్తమ పద్ధతులను స్వీకరించడానికున్న ప్రాధాన్యాన్ని ఆమె వివరించారు. 

కార్యక్రమంలో పాల్గొన్న పాత్రికేయులను డీపీఆర్వో పీ శ్రీనివాస్ ప్రశంసిస్తూ... ప్రజలకు కచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని సకాలంలో అందించడంలో మీడియా పాత్రను బలోపేతం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం లో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.