నిబంధనలకు నీళ్లు.. ఇంటర్ అడ్మిషన్లు ఫుల్
షెడ్యూల్ విడుదల కాకున్నా అడ్మిషన్లు
రిజిస్ట్రేషన్ పేరిట రూ. 10 వేలు వసూలు
ట్యూషన్ ఫీజు రూ. 1 లక్షలు, హాస్టల్ ఫీజు అదనం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 2 (విజయక్రాంతి) : నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే నగరంలోని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు అడ్మిషన్లు ప్రారంభించాయి. ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ విడుదల చేయనప్పటికీ నగరంలోని వివిధ ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలు యథేచ్ఛగా అడ్మిషన్ల దందా కొనసాగిస్తున్నా యి. పలు కాలేజీల్లో ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రి య పూర్తయిందనీ పలువురు చర్చించుకుంటున్నారు. అడ్మిషన్ కోసం విద్యార్థులు వారి తల్ల్లిదండ్రులకు ఉన్న ఆసక్తిని కాలేజీల యాజమాన్యాలు క్యాచ్ చేసుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా ఇంటర్మీడియట్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కృత్రిమ కొరత.. ఏటేటా ఫీజుల మోత
ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు పీఆర్వోలను నియమించుకొని అడ్మి షన్లను పూర్తి చేసుకుంటున్నాయి. అడ్మిషన్లు పరిమితమని పీఆర్వోలు సృష్టించే కృత్రిమ కొరత కూడా వేగిరపాటున అడ్మిషన్లు తీసుకోవడానికి కారణం అవుతోంది. అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజు పేరిట రూ. 10 వేలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం.. ఇంటర్మీడియట్ ట్యూష న్ ఫీజు కేవలం రూ. 1760మాత్రమే. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆసక్తిని గమనించి ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు ఏటేటా ఫీజుల మోత మోగిస్తున్నాయి. పలు కాలేజీల్లో ట్యూషన్‌ఫీజు రూ. 1 2లక్షలు వసూలు చేస్తున్నారని సమాచారం. హాస్టల్ ఫీజు అదనం దానికోసం నెలకు రూ. 10వేలు వసూలు చేస్తున్నారు.
నీట్, జేఈఈ మెయి న్స్ లాంటి కోర్సులకు శిక్షణ పేరిట, ఫోకస్, ఐ20, సూపర్ 6, లాంటి ముద్దుపేర్లతో బ్రాంచిలను ఏర్పాటు చేసి అదనంగా ఫీజుల వసూలు చేస్తున్నారు. ఆ కాలేజీల్లో చదివితే మంచి మార్కులు, ఉత్తమ ర్యాంకులు వస్తాయని భావించి తల్లిదండులు వారి పిల్లలను ఈ కాలేజీలో చదివించడానికి క్యూ కడుతున్నారు. ఈ సందర్భంలో విద్యార్థులకు ఉండాల్సిన కనీస వసతులను పట్టించుకోవడం లేదు. కాగా మార్కులు, ర్యాంకులే ధ్యేయంగా విద్యార్థులపై కలుగుతున్న ఒత్తిడిని భరించలేక పలువురు విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. వారంతపు పరీక్షలు నిర్వహించడం, ఆ మార్కులను తల్లిదండ్రులకు పంపించడం, కాలేజీ క్యాంపస్‌లో డిస్‌ప్లే చేయడం వల్ల కలిగే మానసిక ఇబ్బందితో పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని సైకియాట్రిస్టు నిపుణులు అంటున్నారు.
అడ్మిషన్ షెడ్యూల్ ఇంకా రాలేదు
ఇంటర్మీడియట్ అడ్మిషన్ షెడ్యూల్ ఇంకా రాలేదు. ఈ నెలలో వస్తుంది. జూన్ 1 నుంచి కాలేజీలు ప్రారంభం అవుతాయి. ముందస్తు అడ్మిషన్లు చేయడానికి ఎవరికీ అనుమతి లేదు. మా దృష్టికి వస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఇంటర్మీడియట్ ట్యూషన్ ఫీజు రూ. 1760 మాత్రమే. కాలేజీల్లో హాస్టళ్ల నిర్వాహణకు ప్రభుత్వం నుంచి అనుమతి లేదు.
దాసరి ఒడ్డెన్న, డీఐఈవో, హైదరాబాద్
ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలి
ముందస్తు అడ్మిషన్లు, ఫీజుల దందాపై ఇంటర్‌బోర్డు అధికారులు స్పందించి, ఆ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల సంఖ్య లేదని, రేషనలైజేషన్ పేరిట ఇంటర్ కాలేజీలను మూసేస్తున్న ప్రభుత్వం ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల ఆగడాలపై స్పందించడం లేదు.
ఆర్. ఎల్. మూర్తి, ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర అధ్యక్షుడు




